హైదరాబాద్ : ఖానామెట్ భూముల ఈ-ఆక్షన్ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్ఐఐసీ ఈ వేలాన్ని నిర్వహించింది. హైటెక్స్, హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ సమీప గ్రామం ఖానామెట్‌లోని సర్వే నంబర్ 41/14లోని 14.91 సెంట్లకు శుక్రవారం అధికారులు ఆన్లైన్ వేలం నిర్వహించారు. కనీస బిడ్‌ను ఎకరాకు రూ.25 కోట్లుగా నిర్ణయించారు. 14.91 సెంట్లను ఐదు ప్లాట్లుగా విభజించారు. ఆక్షన్‌లో ఈ ఐదు ప్లాట్లను దక్కించుకున్న సంస్థల వివరాలిలా ఉన్నాయి.
ప్లాట్ నంబరు 4లోని 3.15 ఎకరాలను ఎకరాకు రూ. 48.60 కోట్ల చొప్పున 153.09 కోట్లుకు లింక్‌వెల్ టెలిసిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబరు 6లోని 3.15 ఎకరాలను ఎకరా రూ. 43.60 కోట్ల చొప్పున 137.34 కోట్లకు అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ చేజిక్కుకుంది. ప్లాట్ నంబరు 12 లోని 3.69 ఎకరాలను ఎకరా రూ.50.40 కోట్ల చొప్పున 185.98 కోట్లకు జి.వి.పి.ఆర్.ఇంజినీర్స్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. ప్లాట్ నంబరు 14లోని 2.92 ఎకరాలను ఎకరా రూ.55 కోట్ల చొప్పున 160.60 కోట్లుకు మంజీరా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ప్లాట్ నంబరు 17లోని 2 ఎకరాలను ఎకరా రూ. 46.20 కోట్ల చొప్పున 92.40 కోట్లకు లింక్‌వెల్ టెలిసిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ కైవసం చేసుకుంది. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం 729.41 కోట్లు సమకూరింది.