ఖమ్మం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఖమ్మంలో మంళవారం నిర్వహించిన నిరసన ర్యాలీ నవ్వులపాలైంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు ఫ్లెక్సీని పట్టుకొని ర్యాలీ అగ్రభాగాన నడిచారు.
ఆ ఫ్లెక్సీలో ‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా’ అని కాకుండా ‘కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్‌షా’ అని ఉంది. అయినా అదే ఫ్లెక్సీ పట్టుకొని వారు ప్రదర్శన చేస్తుండడాన్ని చూసి నగర ప్రజలు నవ్వుకున్నారు. ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న భట్టి, తుమ్మల వంటి వారు తాము పట్టుకున్న ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి హోదా తప్పుగాఉన్నా పరిశీలించకపోవడం ఏమిటంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశం సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నది.