MLA Danam Nagender | హిమాయత్ నగర్, జూన్ 10 : గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని ఆయన తెలిపారు. మంగళవారం ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షేక్‌పేట మండలం పరిధిలోని 77 మంది, ఖైరతాబాద్ మండలం పరిధిలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్య క్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఇబ్బందులు పడితే తన దృష్టికి తీసుకువస్తే రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉండదని, పనిచేసే వారికి పదవులు వస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ చరిత్రలోనే మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధి నుంచి ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దానం నాగేందర్ స్పందిస్తూ, దానికి ఇంకా సమయం ఉందని, అందరూ వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు మామిడి నర్సింగ్ రావు, భారతీనాయక్, షరీఫ్, అరుణ్, శివ పాల్గొన్నారు.