హైదరాబాద్: ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది.. అందుకే నాపై కేసు పెట్టాడంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) ఫైర్ అయ్యారు. ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్ ఘటనలో హైడ్రా ఎమ్మెల్యేపై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏవీ రంగనాథ్ నాపై కావాలనే కేసు పెట్టాడు. కొత్తగా వచ్చిన పదవి ఆయనకు ఇష్టం లేనట్లుంది. అందుకే నాపై కేసు పెట్టాడు. సీఎంకు ఫిర్యాదు చేస్తా.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ నేను లోకల్. ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. నందగిరి హిల్స్ హుడా లేఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే అక్కడికి వెళ్లా. ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నాపై కేసు నమోదు విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లా. కేసులు నాకు కొత్తేమి కాదు. గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారు. నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటిసులు పంపిస్తా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.’ అంటూ అధికారులపై నోరు పారేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 10న ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌కు చేరుకుని ఆక్రమణదారులను రెచ్చగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చి వేసినట్టు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు. దీంతో పోలీసులు దానంతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.