KGBV | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు. అటు టీచర్ల సమ్మె.. ఇటు సమీపిస్తున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో కేజీబీవీల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌తో సమగ్రశిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారంతో 18వ రోజుకు చేరుకుంది. స్పెషలాఫీసర్లు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలంతా బోధన బంద్ పెట్టి సమ్మె చేస్తున్నారు. కొన్ని కేజీబీవీల్లో బోధనేతర సిబ్బంది (వంట మనుషులు, స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు) సైతం సమ్మె చేస్తున్నారు. దీంతో 18 రోజులుగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. రాష్ట్రంలో 495 కేజీబీవీలుండగా, వీటిల్లో పదో తరగతిలో 25వేల మంది, ఇంటర్లో 10వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి సిలబస్ పూర్తికాకపోవడం, రివిజన్ చేయాల్సి ఉండటంతో అంతిమంగా దీని ప్రభావం వార్షిక పరీక్షల ఫలితాలపై పడనుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం సమగ్రశిక్ష ఉద్యోగులు, కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య కోరారు.
రెగ్యులరైజ్, టైం స్కేల్ వర్తింపజేయాలన్న డిమాండ్లతో పోరాటం చేస్తున్న సమగ్రశిక్ష (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్ జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ సందర్శించి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతామని హామీనిచ్చారు. సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు రెండు దశాబ్దాలుగా ఉద్యోగ భద్రతలేదని, ఐదేండ్లుగా వేతనాలు పెంచలేదని, దీంతో 18 రోజులుగా వారు సమ్మె చేస్తున్నారని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమగ్రశిక్ష ఉద్యోగులతో ప్రభుత్వం, విద్యాశాఖ చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు బీరెల్లి కమలాకర్‌రావు, గుండు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ పరిస్థితి..
కామారెడ్డి లింగపేట కేజీబీవీలో 20 మంది స్టాఫ్ పనిచేస్తుండగా అందరూ సమ్మెలో ఉన్నారు. ఈ స్కూళ్లో 357 మంది విద్యార్థులున్నారు. పదో తరగతిలో 40, ఇంటర్లో 100మందికి పైగా విద్యార్థులున్నారు. ఉపాధ్యా యులు అందరూ సమ్మెలోకి వెళ్లడంతో క్లాసులు జరగడంలేదు. ఇదే జిల్లాలో 19 కేజీబీవీలుండగా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ కేజీబీవీలో 13 మంది బోధనా సిబ్బంది, 8 మంది బోధనేతర సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. ఈ స్కూళ్లో 163 మంది విద్యార్థులున్నారు. ముగ్గురు టీచర్లు, నలుగురు వంట మనుషులను తాత్కాలికంగా సమకూర్చారు. 13 మంది టీచర్లు పనిచేయాల్సిన ఈ స్కూళ్లో ముగ్గురు టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. భద్రత కోసం కానిస్టేబుళ్లకు విధులు కేటాయించారు.
నిర్మల్ జిల్లా లక్షణచందా కేజీబీవీలో 16 బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. ఈ కేజీబీవీలో 395 విద్యార్థులుండగా, సమ్మెతో పదో తరగతి, ఇంటర్ సిలబస్ ఇంకా పూర్తికాలేదు.