Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలి. మహత్తర ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తేవాలి. గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు అత్యంత విలువైన ఆస్తిని పడావు పెట్టడం ఎందుకు?
– మోహన్ గురుస్వామి
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం నీళ్లు రాక అల్లాడుతున్నామని, పంటలు వేసే పరిస్థితి లేక భూములను పడావు పెడుతున్నామని రైతులు కన్నీరుమున్నీరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదు. ప్రాజెక్టులో దెబ్బతిన్నది రెండు పిల్లర్లే, మొత్తం ప్రాజెక్టు కాదు. కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని నిపుణులు, మేధావులు సూచించినా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వెంటనే పునర్వినియోగంలోకి తేవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినా చెవికి ఎక్కించుకోలేదు. చివరికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మోహన్‌గురుస్వామి కూడా ఇదే చెప్తున్నారు.
కేసీఆర్‌పై అవినీతిపరుడు అనే ముద్ర వేయాలన్న మొండిపట్టుదలకు పోయి లక్షలాది మంది రైతుల పొట్టకొట్టొద్దని కోరుతున్నారు. రాష్ర్టానికి జీవనాడిగా ఉన్న ప్రాజెక్టును మూలకు పెట్టడం సబబుకాదని సూచించారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఆయన ఫేస్బుక్లో పోస్ట్‌లుచేశారు. కనీసం ఆయన మాటలైనా సీఎం రేవంత్‌రెడ్డి చెవికి చేరుతాయా?, వేలాది మంది రైతుల గోస కనిపించని ప్రభుత్వ పెద్దలు గురుస్వామి మాటలు వింటారా? అని రైతులు, నిపుణులు, విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి గజ్వేల్ నియోజకవర్గంవైపు నీటిని తీసుకెళ్లే అక్విడెట్ పొంగి పొర్లుతున్నది. ఈ ఫొటోలను మోహన్ గురుస్వామి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన 2022లో కొండపోచమ్మసాగర్‌ను సందర్శించినప్పటి విశేషాలను మరోసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి తెలంగాణకు సేవలందించాలి’ అనే శీర్షికతో చేసిన పోస్ట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలిగేలా ప్రాజెక్టు గొప్పదనాన్ని వివరించడంతోపాటు, మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకతపై మార్గనిర్దేశనం చేశారు.
‘కొండపోచమ్మ సాగర్ నుంచి గజ్వేల్ పరిధిలోని చిల్లాసాగర్, నారాయణపూర్‌కు నీళ్లను తీసుకెళ్లే అక్విడెట్ పొంగి పొర్లుతున్నది. కొన్నిరోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ఇది నిదర్శనం. కానీ ఈ కాలువలో రెండేండ్లుగా నీళ్లు పారడం లేదు. ఉస్మాన్‌సాగర్ కన్నా కొండపోచమ్మసాగర్ మూడు రెట్లు పెద్దది. 150 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భారీ పంపులతో ఎత్తిపోసి కొండపోచమ్మసాగర్‌కు తరలించేవారు’ అని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బరాజ్‌లు మాత్రమే కాదని నిపుణులు, బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ప్రెస్మీట్ల ద్వారా, ప్రజెంటేషన్ల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అయినా ప్రభుత్వం తలకు ఎక్కించుకోలేదు. మేడిగడ్డ బరాజ్‌ను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టే వ్యర్థం అయినట్టు మాట్లాడుతున్నారు. కానీ.. ప్రభుత్వ సలహాదారు మోహన్ గురుస్వామి తన పోస్ట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనాన్ని వివరించారు.
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని కొనియాడారు. ‘ఏడు లింకులు, 28 ప్యాకేజీల్లో నిర్మాణం అయిన ఈ ప్రాజెక్టు 13 జిల్లాలగుండా 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రాజెక్టు కెనాల్ నెట్వర్క్ పొడవు 1800 కిలోమీటర్లపైనే. ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు. ఇందులో 169 టీఎంసీలను వ్యవసాయానికి కేటాయించగా, 30 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల అవసరాలకు, 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం, 10 టీఎంసీలను తాగునీటి కోసం కేటాయించారు. ప్రాజెక్టు ద్వారా సుమారు13 జిల్లాల్లో కలిపి 18.25 లక్షల ఎకరాలకు సాగునరు అందుతున్నది. ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మతోపాటు మరో రెండు భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది మల్లన్న సాగర్’ అని మోహన్‌గురుస్వామి వివరించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతం పచ్చగా మారిందని, తద్వారా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రశంసించారు.
మోహన్ గురుస్వామి 2022 ఆగస్టులో కొండపోచమ్మసాగర్‌ను సందర్శించినప్పుడు కలిగిన అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. ‘చైనా మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్‌కు త్రీ గోర్జెస్ డ్యామ్(ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్) నిర్మాణ ప్రణాళికలను ఆయన సహచరుడు లీ జిషాన్ వివరించినప్పుడు, రోజంతా నిద్రపోతానని చెప్పారట. మరునాడు లేచిన తర్వాత ‘భూమిపై కట్టబోయే సముద్రంలో నుంచి సూర్యోదయాన్ని చూడటం అద్భుతంగా ఉండబోతున్నది’ అని ప్రశంసించారట. ఈరోజు నేను హైదరాబాద్ నగరం దాటి 40 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కొండపోచమ్మసాగర్‌కు చేరుకున్నాను.
అక్కడ వెండి చాపలా పరుచుకున్న నీటిలోకి అస్తమిస్తున్న సూర్యుడు ఒదిగిపోవడం కనిపించింది. కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టిన ఈ రిజర్వాయర్‌తో సమానమైనది హైదరాబాద్ చుట్టుపక్కల మరొకటి లేదు. ఇప్పటివరకు ఏ నిజాంప్రభువు కూడా ఇంత భారీనిర్మాణం చేపట్టలేదు. ఈ డ్యామ్ నది ప్రవాహంతో నిండింది కాదు, గోదావరి జలాలను భారీ పంపులతో ఎత్తిపోసి, ఇక్కడిదాకా తరలించగా ఏర్పడిన భారీ జలాశయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తులో ఉన్న రిజర్వాయర్ ఇది’ అని గురుస్వామి తన పోస్ట్‌లో కొండపోచమ్మ సాగర్‌ను అద్భుతంగా కొనియాడారు.
మూడేండ్ల క్రితం (2019లో) కొండపోచమ్మసాగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఫార్మ్‌హౌజ్ తప్ప పెద్దగా ఏ హడావుడీ లేదని గురుస్వామి గుర్తు చేసుకున్నారు. ‘ఈ ప్రాంతం మొత్తం పొడిగా, పొదలతో నిండి ఉండేది. నా స్నేహితుడు తన ఫార్మ్‌హౌజ్‌లో చెట్లకు పోయడానికి నీళ్లను కొనుగోలు చేయడం నేను చూశాను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఫతేపూర్ సిక్రీ గుర్తుకు వస్తున్నది. అక్బర్ రాజధాని కోసం సకల వసతులతో ఫతేపూర్ సిక్రీని నిర్మించినా, సరిపడా నీటిని మాత్రం అందుబాటులో ఉంచలేకపోయారు. కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ ఎప్పుడూ ఎండిపోని రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు’ అని కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని శతాబ్దాల పాటు సేవలందిస్తుందని, తెలంగాణను పచ్చనిమాగాణం చేసేందుకు కృషిచేసిన ధీరుడిగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తే దాని గొప్పతనం అర్థం అవుతుందని సూచించారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంటే కాకతీయ రాజులు, కుతుబ్షాషీలు, అసఫ్జాహీలు వంటివారు గుర్తుకు వచ్చేవారని, దేశ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు పుట్టిన గడ్డగా గుర్తు పట్టేవారన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి ప్రపంచం చూపును తెలంగాణ వైపు నిలిపారంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని, రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ప్రాజెక్టు వృథా అయ్యిందని సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, నేతలంతా గోబెల్స్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్టులో రెండు పిల్లర్లకు జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి, రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది మంది రైతుల జీవితాలను బలిపెట్టవద్దని మేధావులు, నిపుణులు సూచిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వినడం లేదు. మాజీ సీఎం కేసీఆర్‌పై అవినీతి ముద్ర వేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏడాదిన్నర కాలంగా పడావు పెట్టారు.
ఫలితంగా నిరుడు వర్షాలు లేక, కాళేశ్వరం నీళ్లు అందక వేలాది ఎకరాల్లో రైతులు పంటలు కూడా వేయని పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటి, తాగునీటి కోసం అల్లాడిన దుస్థితి కలిగింది. ఎంత మంది ఎన్ని విధాలుగా , ఎన్నిసార్లు మొత్తుకున్నా వినని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కనీసం తమ సలహాదారు చెప్పే మాటలనైనా చెవికి ఎక్కించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని, రైతులను ఆదుకోవాలని సూచిస్తున్నారు.
గోదావరి జలాలతో నిండాల్సిన రిజర్వాయర్లు ఇప్పుడు వర్షాలపై ఆధారపడి నిండుతున్నాయని గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బరాజ్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా, పంపింగ్ చేయకుండా నిలిపివేయడంతో రిజర్వాయర్లు వృథాగా మారుతున్నాయన్నారు. కాబట్టి కచ్చితంగా మరమ్మతులు చేయాలని కోరారు.
‘ఈ మహత్తర ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తేవాలంటే మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతులు చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై అవినీతి, అసమర్థ ముద్ర వేసేందుకు మరమ్మతు పనులను ఆలస్యం చేస్తున్నది. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సంవత్సరం భారీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫర్వాలేదు. మరి వచ్చే ఏడాది వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. కేవలం గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఇంత భారీ ప్రాజెక్టును పడావు పెట్టడం సబబేనా? అని నిలదీశారు. ఒకవేళ ప్రభుత్వం ఇలాగే ప్రాజెక్టును పక్కన పెడితే భస్మాసురహస్తాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుందని హెచ్చరించారు.
నాడు జలకళ
నేడు వెలవెల