హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): ఆయనో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత. ఉత్తర తెలంగాణ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి, మరోసారి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఎలాంటి పదవీలేదు. కానీ, ఆయనంటే సబ్ రిజిస్ట్రార్లు వణికిపోతున్నారు. ఆయన వల్ల ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. ఆయన చెప్పింది చేస్తే ఓకే.. లేదంటే ఉద్యోగాలు ఊడిపోతాయనే ఆందోళన వారిలో నెలకొన్నది. ఇప్పటికే ఆయన ఆరాచకత్వానికి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇంకెంతమంది సబ్ రిజిస్ట్రార్ల మెడపై కత్తి వేలాడుతున్నదో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఇందుకు కారణం ఆయనగారి అవినీతి ‘మధుర’ ఫలాల అత్యాశే. పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, పైసలు కమాయించడం ఎలా? అని ఆలోచించారు. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖపై కన్నేశారు.
‘సబ్ రిజిస్ట్రార్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వాళ్లనుంచి మనం దోచేసుకుందాం’ అనుకొని స్కెచ్ వేశారు. వెంటనే సబ్ రిజిస్ట్రార్లకు ధమ్కీలు మొదలుపెట్టారు. ‘పైకం కట్టండి లేదా నేనిచ్చే ఫైళ్లు క్లియర్ చేయండి. ఈ రెండు చేయకపోతే ఇక మీ ఇష్టం. జరగబోయే పరిణామాలకు నేను బాధ్యున్ని కాదు’ అంటూ హెచ్చరికలు జారీచేశారు. ఆ తర్వాత తన అనుంగు అనుచరుడు ‘సుదర్శన’ చక్రాన్ని రంగంలోకి దింపారు. ఆ చక్రం రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వసూళ్లు చేయడం, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఫైళ్లు క్లియర్ చేయించడం మొదలుపెట్టారు. ఈవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖలో సదరు కాంగ్రెస్ నేత ఆరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి నెలా పది లక్షలు
వసూళ్ల పర్వానికి తెరతీసిన సదరు కాంగ్రెస్ నేత సబ్ రిజిస్ట్రార్లకు రెండు కండీషన్లు పెట్టినట్టు తెలిసింది. ఇందులో ఒకటి ప్రతి నెల రూ.10 లక్షలు చెల్లించాలని, లేదంటే తాను పంపిచ్చే ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. రెండు లేదా మూడు ఫైళ్లు పంపిస్తానని, వాటిని ఎలాంటి కొర్రీలు లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే, కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఎంతోకొంత ముట్టజెప్పి సైలెంట్‌గా ఉంటున్నట్టు తెలిసింది. ఇక మరికొందరు ఫైల్స్ క్లియర్ చేయడానికి అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
జీ-పేలో పైసలు పంపి..రివర్స్‌లో అవినీతి ఫిర్యాదులు
తన మాట వినకుండా, మామూళ్లు చెల్లించకుండా, ఫైళ్లు క్లియర్ చేయని అధికారులపై కక్షగడుతున్నట్టు సమాచారం. ఇలాంటి అధికారులపై రివర్స్‌లో అవినీతి కేసులో ఇరికిస్తూ సస్పెండయ్యేలా చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ఘటనలు ఈ కోవలోనివేనంటున్నారు. ఈ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు లంచం తీసుకున్నారనే కారణాలతో సస్పెండయ్యారు. అయితే, ఈ ఇద్దరు కూడా సదరు కీలక నేత చెప్పిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒక ఫైల్‌ను క్లియర్ చేయగా మరో ఫైల్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నిరాకరించినట్టు తెలిసింది. దీంతో సదరు కీలక నేత భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం. సదరు అధి
కారి అకౌంట్‌కు జీ-పే ద్వారా డబ్బులు పంపించి.. తమ వద్ద లంచం తీసుకున్నారంటూ ఆ అధికారిపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ కేసుల్లో ఆ ఇద్దరు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విధంగా ఆ నేత ధన దాహానికి ఇంకా ఎంతమంది బలికావొస్తుందోననే ఆందోళన సబ్ రిజిస్ట్రార్లలో వ్యక్తమవుతున్నది.
‘సుదర్శన’ చక్రంతో వసూళ్లు, బెదిరింపులు
సదరు కీలక నేత తన వసూళ్ల పర్వానికి ‘సుదర్శన’ చక్రాన్ని అస్త్రంగా వాడుతున్నట్టు తెలిసింది. ఈ నేత ఆదేశాల మేరకు సదరు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లడం, సబ్ రిజిస్ట్రార్లపై బెదిరింపులకు దిగడం, పనులు చేయించుకోవడం, వసూళ్లు చేయడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ ‘సుదర్శన’ చక్రానికి ఓ చిన్న పేపర్లో పనిచేసే అల్లుడు ఉన్నట్టు తెలిసింది. ఆ కీలక నేత ఆదేశాల ప్రకారం ముందుగా ‘సుదర్శన’ చక్రం, అల్లుడు కలిసి సబ్ రిజిస్ట్రార్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసింది. వీళ్లు చెప్పినదానికి ఒప్పుకొంటే సరి.. లేదంటే జీ-పే, అవినీతి ఫిర్యాదుల రూపంలో రివర్స్ ఆరోపణలు చేస్తూ వారిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి హెచ్చరికలు బేఖాతరు
సదరు కీలక నేత ‘మధుర’ ఫలాల అరాచకాలు, సబ్ రిజిస్ట్రార్లపై వేధింపులు మంత్రి దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. దీంతో మంత్రి సదరు నేతను సచివాలయానికి పిలిపించి…‘అన్నా మీరు చేస్తున్నది బాగా ఇబ్బందిగా ఉన్నది. సబ్ రిజిస్ట్రార్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొంచెం ఇలాంటివి మానుకో అన్నా. ఈ శాఖను వదిలేయ్..’ అంటూ సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది. కానీ, ఆ నేత తన ఆగడాలను మాత్రం తగ్గించుకోలేదని తెలిసింది. మంత్రి హెచ్చరికలను బేఖాతరు చేసిన ఆ నేత.. ఎప్పటిలాగే మళ్లీ తన వసూళ్లపర్వం మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే, ఈ విషయం కూడా మళ్లీ మంత్రి దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో సచివాలయానికి వచ్చి తనను కలవాలంటూ ఆ నేతకు మంత్రి గట్టిగానే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.