హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా.. కేసీఆర్ హయాంలో గత పదేండ్లలో జరిగిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో ప్రముఖుడు కొనియాడారు. మంగళవారం ముగిసిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థికాభివృద్ధిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి కూడా చేరారు. గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘అప్పర్ మిడిల్ ఇన్కమ్’ స్టేటస్‌ను కలిగి ఉన్నదని చెప్పారు. ఈ స్టేటస్‌ను భారత్ సాధించాలంటే మరో ఐదు నుంచి ఏడేండ్ల సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం సుమన్ బేరి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణలో అద్భుత ప్రగతి
సమ్మిట్‌లో సుమన్ బేరి మాట్లాడుతూ.. ‘సృజనాత్మకత, ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, పెట్టుబడుల కారణంగా తెలంగాణ ‘అప్పర్ మిడిల్ ఇన్కమ్’ జోన్‌కు చేరుకున్నది’ అని తెలిపారు. ప్రపంచబ్యాంకు ప్రమాణాల ప్రకారం.. తెలంగాణ తలసరి ఆదాయంలో ప్రస్తుతం ‘అప్పర్ మిడిల్ ఇన్కమ్’ దేశాల సరసన నిలిచిందని పేర్కొంటూ.. కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థికాభివృద్ధిని పరోక్షంగా కొనియాడారు. ప్రపంచవ్యాప్త గుర్తింపునకు తెలంగాణ ఎంచుకున్న లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రేవంత్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. ‘మిడిల్ ఇన్కమ్ ట్రాప్’లో తెలంగాణ పడొద్దని, పాత పద్ధతుల్లో అభివృద్ధి చేస్తామనే ధోరణిని వీడాలని సూచించారు.
తెలంగాణ ఎంతో ప్రత్యేకం
భారత్‌లో ప్రతి రాష్ట్రం విలక్షణమైనదని, మానవ వనరుల కారణంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందిందని సుమన్ బేరి చెప్పారు. ఇక్కడి వారంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం ఉంటుందని అన్నారు. రిస్క్ తీసుకోవడంలో.. వ్యాపార దక్షతలో తెలుగు వారు ‘ఐరిష్ ఆఫ్ ఇండియా’ అని, సాహసం, సంపదను సృష్టించే గుణం వీరిలో ఉన్నదని ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో తెలంగాణ విజన్ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. భవనాలు, నిర్మాణాల కంటే ఉత్పాదకత పెంచడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిబంధనల సరళీకరణపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెలంగాణ ఓ ప్రత్యేకత, విజన్‌ను నిర్దేశించుకున్నదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో నీతి ఆయోగ్ తోడ్పాటు అందిస్తుందని ఆ సందర్భంగా మాటిచ్చారు. మౌలిక వసతులే కాకుండా.. ఉత్పాదకత పెంచే దిశగా ప్రభుత్వ పాలసీలు ఉండాలని సూచించారు. ఉత్పాదక శక్తి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో తెలంగాణ రానున్న రోజుల్లో మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
బేరి స్వీయ అనుభవం ఇలా..
ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశానికి 2006లో తాను హైదరాబాద్ వచ్చానని సుమన్ బేరి తెలిపారు. అప్పుడు హైటెక్ సిటీ పేరుతో ఓ బోర్డు మాత్రమే తాను చూశానని చెప్పారు. అప్పుడు అక్కడ అసలేమీ లేదని, ఇప్పుడు మాత్రం.. ‘ఓ మైగాడ్.. అక్కడ ఓ అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించారు’ అంటూ పరోక్షంగా కేసీఆర్ హయాంలో జరిగిన నగరాభివృద్ధిని కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడంలో సాటిలేని వారనేందుకు ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.