అమరావతి : తెలంగాణ మంత్రి కొండ సురేఖ ( Konda Surekha ) తిరుమల (Tirumala) దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు. శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తెలంగాణ భక్తులకు జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ (TTD ) స్వీకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణ భక్తుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడగా సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. టీటీడీ తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అప్పట్లో తమ దురదృష్టం వల్ల శ్రీశైలాన్ని కోల్పోయి ఆంధ్రాకు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తోందని , టీటీడీ తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో దేవాలయాలు, కల్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలని మంత్రి కోరారు.