హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు, మద్యం పంపిణీతోపాటు బెదిరింపులు, రిగ్గింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పక్రటన విడుదలచేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్‌ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. ఎన్నికలను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌చేశారు. యూసుఫ్‌గూడలోని 241వ పోలింగ్‌బూత్‌లో దొంగఓట్లు వేస్తున్న వారిని బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోలేదని ఆరోపించారు. దొంగఓట్లు వేసిన వారిని వదిలిపెట్టి బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మహమూద్, సవేరా ఫంక్షన్‌హాళ్లలో వందల మంది దొంగఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు.