ఖైరతాబాద్, మార్చి 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో లంబాడీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. కనీసం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మాట్లాడే లంబాడీ గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భరత్ చవాన్, రాము నాయక్, సహాయ కార్యదర్శి చందర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.