ఒకరు కష్టపడి పునాది నుంచి మొదలుపెట్టి, ఇటుక ఇటుక పేర్చి, ఇంటిని అందంగా కట్టుకున్నారు. ఆయన తర్వాత యజమానిగా మారిన వ్యక్తి వీలైతే ఆ ఇంటిని మరింత అభివృద్ధి చేయాలి. చేతగాకపోతే కనీసం చెడగొట్టకుండా అయినా కాపాడగలగాలి. అలా కాకుండా ఆ ఇంటి పునాదులే కదిలిపోయేలా నష్టం కలిగిస్తే.. ఆ యజమానిని ఏమనాలి?
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధి చెందినదని చెప్పడానికి అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను(జీఎస్డీపీ) ప్రామాణికంగా తీసుకుంటారు. తలసరి, జీఎస్డీపీలోనే కాదు వ్యవసాయం, పారిశ్రామికీకరణ, సేవలు, సంక్షేమం.. ఇలా అన్ని రంగాల్లోనూ గణనీయ పురోగతి సాధించింది. విభజన తర్వాత పుట్టెడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పసికూన తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కానీ, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఆ పూలబాటలో నడువడం కూడా రేవంత్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఒకప్పుడు తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధిరేటులో దేశానికే చిరునామాగా నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు అంతకంతకూ ఆ ర్యాంకును కోల్పోతున్నది. వృద్ధిరేటు క్రమంగా పడిపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక(సోషియో ఎకనామిక్ ఔట్లుక్)-2026 నివేదిక గణాంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలో సగటున ఒక్కో పౌరుడు సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా పిలుస్తారు. తలసరి వృద్ధిరేటును ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనంగా భావిస్తారు. ఈ రెండు అంశాల్లో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే.. తెలంగాణ గతంలో ఎంతో ఎత్తులో ఉండేది. కేసీఆర్ హయాంలో పదేండ్లలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో పౌరుల తలసరి ఆదాయం రాకెట్ వేగంతో దూసుకుపోయిందనేది అక్షర సత్యం. ఆ వేగానికి రేవంత్ బ్రేకులు వేసినట్టు ఆర్థిక సర్వే చెబుతున్నది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో 15.34 శాతం వృద్ధిరేటు నమోదైతే, కాంగ్రెస్ పాలనలో ఇది కేవలం 10.2 శాతానికే పరిమితమైంది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు తోడు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల కారణంగా ఎవుసం పండుగైంది. తద్వారా సాగు విస్తీర్ణం ఎంతో పెరిగింది. ధాన్యం దిగుబడి కొత్త రికార్డులను నమోదు చేసింది. విద్యుత్తు సంస్థల బలోపేతం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో పెరుగుదల, విద్య-వైద్య రంగాల అభివృద్ధి, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, వైద్య కళాశాలల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, అన్నివర్గాల అభ్యున్నతికి 400కు పైగా చేపట్టిన కార్యక్రమాలు ఇలా చెప్పుకొంటూ పోతే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమాల జాబితా ఎంతో పెద్దది. అయితే, తాజా సర్వేలో ఆ అంశాలను ప్రస్తావించని కాంగ్రెస్ ప్రభుత్వం.. అవి కూడా తమ ఘనతగా చెప్పుకొనే ప్రయత్నం చేసింది. గతంలో జరిగిన ప్రగతిని విస్మరించి.. తాము 27 నెలల కాలంలో చేయనటువంటి పనులను కూడా చేసినట్టు చెప్పుకొచ్చింది. ఉదాహరణకు.. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన హరితహారం పథకం వల్లే రాష్ట్రంలో గ్రీన్ కవరేజీ జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువగా పెరిగిందనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 27,688 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది. జాతీయ సగటు 23.59 శాతంతో పోలిస్తే, తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24.69 శాతంగా (1.1 శాతం ఎక్కువ) ఉన్నట్టు వెల్లడించింది. అయితే, ఆర్థిక సర్వేలో అటవీ విస్తీర్ణం ఎంత ఉందన్న విషయాన్ని మాత్రమే పేర్కొన్న రేవంత్ ప్రభుత్వం.. దానికి కారణమైన ‘హరితహారం’ పథకాన్ని నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను ఆర్థిక సర్వేలో నేరుగా ప్రస్తావించని కాంగ్రెస్ ప్రభుత్వం..మారుపేరిట బురిడీ కొట్టించే యత్నం చేసింది. రెండు పడకల గదుల ఇంటి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టగా, ఆ స్కీమ్ పేరును ప్రస్తావించకుండా హౌసింగ్ ఫర్ పూర్ పేరిట అదేదో తమ గొప్ప కార్యక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకరువు పెట్టింది. అంతేకాదు.. బస్తీ దవాఖానలను అర్బన్ హెల్త్ సర్వీసులుగా, టీఎస్ఐపాస్ను ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌గా, గొర్రెల పంపిణీ పథకాన్ని లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ స్కీమ్‌గా, గురుకుల పాఠశాలలను రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లుగా పేర్లు మారుస్తూ అదేదో తాము చేసిన గొప్ప పనులుగా చెప్పుకోవడానికి విఫలయత్నం చేసింది. అలాగే రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితబంధు, ఆసరా, కేసీఆర్ కిట్లు వంటి పథకాల ప్రయోజనాలను సర్వేలో ప్రస్తావించిన కాంగ్రెస్ .. అది కేసీఆర్ ఘనతేనన్న సత్యాన్ని విస్మరించిం ది. అయితే కేసీఆర్ చేసిన పనులు కనుమరుగవుతాయా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కేసీఆర్ పాలనలో ఎవుసం ఒక పండుగగా మారింది. అందుకే 2023లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి దాదాపు 47.34 శాతం మంది ఉపాధి పొందేవారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అయితే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు రంగాన్ని 4.64 శాతం మంది విడిచిపెట్టారు. జీఎస్డీపీలో వ్యవసాయరంగ వాటా నిరుడు 17.3 శాతంగా ఉంటే ఈ ఏడాది 15.1 శాతానికి పడిపోయింది. పరిశ్రమలు, మైనింగ్, తయారీ రంగ వాటా నిరుడు 16.4 శాతంగా ఉండగా ఇప్పుడు 16.3 శాతానికి పరిమితమైంది.
దేశంలోని మొత్తం పౌరుల ఉత్పాదకతను జీడీపీగా వ్యవహరిస్తే, రాష్ట్రంలోని పౌరుల మొత్తం ఉత్పాదకతను స్థూలంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)గా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు 2014-15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) రూ.5.05 లక్షల కోట్లుగా ఉండేది. కేసీఆర్ పదేండ్ల పాలన తర్వాత 2022-23నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ.13.13 లక్షల కోట్లకు చేరింది. దీన్నిబట్టి కేసీఆర్ పాలనలో తెలంగాణ జీఎస్డీపీ రూ.8లక్షల కోట్ల మేర పెరిగిందని అర్థమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఇప్పుడు ఆ జీఎస్డీపీ రూ.17.82 లక్షల కోట్లకు చేరింది. అయితే కేసీఆర్ పాలనతో పోలిస్తే, జీఎస్డీపీ వృద్ధిరేటు రేవంత్ రెడ్డి పాలనలో 1.8 శాతం మేర తక్కువగా నమోదైనట్టు ఆర్థిక సర్వే గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ వృద్ధిరేటు సగటున 12.5 శాతంగా నమోదవగా, 2024-25లో 10.7 శాతానికి పరిమితమైంది.
