సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం.. ఈ జాతి ఆకాంక్ష. ఏడుపదుల స్వతంత్ర భారతావనిలో దాన్ని సాకారం చేసిన ఘనత.. ఆవిర్భావానంతర తెలంగాణ దశాబ్దకాలపు చరిత్ర. సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై.. కేసీఆర్ పాలనలో విరాజిల్లింది తెలంగాణ! ఉమ్మడి పాలనలోని నిత్య దుర్భిక్షం, సాగు ధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం.. అన్నింటినీ మాయం చేసి, తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆరే! రైతును రారాజును చేసిన హరితహాసం ఆ పాలన.
కేసీఆర్ పాలన సుజల, సుఫల, హరితభరిత చరిత! అది తెలంగాణ శిరస్సున ఆకుపచ్చని తలపాగా! అది అన్నదాత నెత్తిన సాగు సగర్వమైన స్వర్ణకిరీటం!
ఇప్పుడేమైంది? ఒక్కసారే అంతా ఎట్ల మాయమైంది? ఏ పాడు దిష్టి తగిలి సాగుబడి కూలబడింది? పాడు తెగులు ఏదో సోకినట్టు.. పచ్చని చేను కండ్లముందరే ఎందుకు ఎండింది? చెరువు ఎందుకు అడుగంటింది? ప్రాజెక్టులు ఎందుకు పడావు పడ్డయ్? నిన్నటిదాకా నీళ్లు పారిన కాలువల్లో తుప్పలెందుకు మొలిచినయ్? ఏ తప్పు తెలంగాణను తెర్లు చేసింది? ఏ నిర్ణయం దశాబ్దం కిందటి దుర్భిక్షంలోకి నెట్టింది?
Telangana | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాగానే కానికాలం, కష్టకాలం ఎందుకు మొదలైంది? అప్పులే పెట్టుబడిగా, కన్నీళ్లే దిగుబడిగా.. నేడు దిగాలుపడి దిక్కులు చూస్తున్నాడు రైతు. కేసీఆర్మీది కక్ష, కాళేశ్వరం మీది కోపంతో ప్రాజెక్టులను ప్రభుత్వమే ఎండబెడితే.. దానికి కర్షకులు కన్నీటిశిస్తును చెల్లిస్తున్నరు. పుష్కలంగా ఎరువులు, విత్తనాలతో రంది లేకుండా సాగిన ఎవుసం.. నేడు ఒక్క బస్తాకోసం కూలైన్లలో తండ్లాడుతున్నది. రైతుబంధు రాక, భరోసా లేక.. అప్పుకాగితమై ఆగమైతున్నది. పదేండ్లు రెప్పపాటైనా పోని కరెంటు.. ఇప్పుడు మళ్లీ గోసపుచ్చుకుంటున్నది. అడుగంటిన బోర్లు! కాలుతున్న మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు! పన్ను కట్టలేదని పట్టుకెళ్తున్న స్టార్టర్లు! గుంటెడు భూమిని తడిపేందుకు ట్యాంకర్ల కొద్దీ కన్నీళ్లు! ఊరిడిశి పోవాల్నో, ఉరిపోసుకుని సావాల్నో తెల్వని స్థితిలో.. నిన్నటి అన్నపూర్ణ! నేడు ఆత్మహత్యల కోన! ఆగమైన కూన.. మన తెలంగాణ!
(నూర శ్రీనివాస్) వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించేందుకు కేసీఆర్ చేసిన ప్రతి పనినీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్ తీసుకున్న ఏ చర్యలతోనైతే వ్యవసాయం బాగుపడ్డదో ఆ ప్రతి చర్యనూ రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నడు. ఆరున్నర దశాబ్దాల తెలంగాణ పోరాటం వెనుక దాగిన ఆరాటం.. పదేండ్ల కేసీఆర్ పాలనలో సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. వెక్కిరించిన ఆంధ్రోళ్లనే వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. రావి, బియాస్, సట్లెజ్, జీలం, చినాబ్ ఇలా పంచ నదులున్న పంజాబ్‌ను తలదన్ని వ్యవసాయంలో తెలంగాణ విశ్వరూపం చూపింది. ఎంతలో ఎంత తేడా వచ్చింది? రైతుకు ఇవ్వాళ ఎంత కష్టమొచ్చింది? రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రైతు, ప్రతి మహిళ ‘దేవుడుపోయి దయ్యం వచ్చింది’ అని నెత్తికొట్టుకుంటున్నరు. సంతోషంగా పంట పొలానికి పోయి ఆహ్లాదంగా గడపాల్సిన రైతు ఎండిన చేను ముందటే వెక్కివెక్కి ఏడ్వాల్సిన చేటు కాలం దాపురించింది.
ఎంతల ఎంత తెర్లయిపోయింది తెలంగాణ? 24 గంటలూ రెప్పవాల్చని వెలుగు జిలుగులతో అలరారిన తెలంగాణకు మళ్లీ మిణుకు మిణుకుమనే చీకటి కాలమెట్లా దాపురించే? పంట పొలాన్ని విడిచిపెట్టి కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సిన దుర్భర దుస్థితెట్లవచ్చె? ట్యాంకర్లు పెట్టి పంటను బతికించుకునే పాడుకాలమెట్ల ముంచుకొచ్చె? కొసాఖరుకు శ్రీరాంసాగర్ కింద, గడ్డెన్నవాగు, చలివాగు, నాగార్జునసాగర్, జూరాల ఇలా ప్రతిచోటా ఏకంగా ప్రాజెక్టుల కిందే రైతులు తమ పంటలకు నీళ్లిమ్మని ఏడ్చే కాలమొచ్చె! పంటను బతికించుకునేందుకు రైతులు అరిగోసపడే రోజులొచ్చె! ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసేవాడు లేక రైతులే మోసుకుపోయే దుస్థితి నెలకొన్నది. ఏమి దుస్థితి? ఎట్లుండె తెలంగాణ పదేండ్లు? ఇప్పుడెట్లున్నది? ఖమ్మం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్నంటే కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టే కావాలె. హైదరాబాద్‌కు నీళ్లివ్వాల్నంటే కొండపోచమ్మ సాగరో, రంగనాయక్సాగరో కావాలె. అయినా సరే.. నీళ్లివ్వాలని అడిగిన రైతులపై ‘నువ్వు మాకేమన్న ఓట్లేసినవా? నీకు నీళ్లెందుకియ్యాలె?’ అని సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు ప్రతాపం చూపిస్తున్నరు. రైతుల మీద కాంగ్రెస్ నేతలు పగబట్టిన్రని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. కొత్తగా ఏం చేయాల్నో తెల్వదు! ఉన్నదాన్ని వాడుకోవటం తెల్వదు! రైతును కాపాడటం తెల్వదు! కాంగ్రెస్ 15 నెలల పాలన దుస్థితి ఇది!. రైతుల నెత్తిన పడిన పిడుగు! ‘పోశమ్మ పొడుగు చేస్తే మైసమ్మ మాయం చేసింది’ అనే సామెత తిరగబడింది. ‘కేసీఆర్ పొడుగు చేస్తే రేవంత్ మాయం చేసిండు’ అన్నట్టే తయారైంది.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువు కట్టల మీద సర్కారీ తుమ్మలు.. పంట పొలాల్లో పరిక్కంపలు.. బీడువడ్డ పొలాలు.. చేనుగట్టున చెట్లకు వేలాడిన రైతు దేహాలు.. ఊరూరా రైతుల బలవన్మరణాలు.. దూపకేడ్చిన చెల్కలు.. నిండని డొక్కలు.. మొగులు దిక్కు రైతుల ముఖాలు! మిణుకు మిణుకుమనే కరెంట్! కరెంట్ వస్తదో రాదో తెల్వదు! కాలిపోతున్న మోటర్లు.. పారిపోతున్న కరెంటోళ్లు! భూతల్లి జలశోకం! పాతాళగంగమ్మ లోలోపలికి పరుగులు! బోర్ల కోసం రెక్కలు ముక్కలైన రైతులు! రైతు మెడపై వేలాడిన మిత్తీ కత్తులు! ఎటుచూసినా చిమ్మచీకట్లు! తెలంగాణ పల్లెల్లో ఇనుప గజ్జెల తల్లి కరాళనృత్యం! తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుల బతుచిత్రమిది! ‘దిగుట్ల దీపాలు..రైతు ప్రాణాలు’ అన్నట్టే తెలంగాణ అంతటా ఛిద్రమైన ఎవుసం! అలనాటి రాచరిక కాలం నుంచి ఉమ్మడి సమైక్య పాలకుల దాకా ఎవ్వరైనా సరే రైతుల ముక్కుపిండి పన్నులు వసూలు చేసినోళ్లే! భూమిశిస్తు రూపంలోనో.. కరెంట్ చార్జీల రూపంలోనో.. నీటి తీరువా రూపంలోనో.. ముక్కుపిండి పన్నులు వసూలు చేసినోళ్లే. దేశ చరిత్రలో ‘రైతుకు ఇవ్వటం’ అనేదాన్ని విధానంగా మొదలుపెట్టిన మొదటి పాలకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే! స్వయంగా తను రైతుకాబట్టి. కేసీఆర్ పదేండ్లు కష్టపడి సగబెట్టిన ఎవుసం ఇరుసు ఇవ్వాళ ఇరుగుతున్నది.
కేసీఆర్ హయాంలో 100శాతం రుణమాఫీ
రాష్ట్రంలో పంట రుణాలు మీదపడి ఏ రైతూ కష్టపడొద్దన్న ఉద్దేశంతో రూ. లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇచ్చిన హామీ మేరకు తొలివిడత ప్రభుత్వంలో 2014-2018 వరకు 35.32 లక్షల రైతులకు సంబంధించి రూ.16,144 కోట్లను, రెండోసారి (2018లో) అధికారంలోకి వచ్చాక 23 లక్షల మంది రైతులకు రూ.13 వేల కోట్ల పంట రుణాలను.. అంటే 2014 నుంచి 2023 వరకు 58.29 లక్షల మంది రైతులకు రూ. 29,144 కోట్ల రుణాలను మాఫీ చేశారు.
60 శాతం మందికి ఎగవెట్టిన కాంగ్రెస్
ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో పంట రుణాల పరిస్థితి ఎలా ఉన్నదో రైతుల అనుభవంలోకి వచ్చింది. నలుగురు రైతులను కలిసి ‘మీకు రెండు లక్షల రుణమాఫీ అయిందా?’ అంటే మోటు సామెత చెప్పినట్టు ‘ఏమైంది? ఇచ్చే బర్రెనిడిసి తన్నే బర్రె ఎంబడి వడ్డట్టయింది’ అని బదులిస్తున్నరు. ‘ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టేసి చెప్పిండు.. దేవుడాన్నే ఉన్నడు.. మాఫీ మాఫీకాన్నే ఉన్నది’ అని చెప్తున్నరు. అందరికీ అయిపోయిందని చెప్తున్న రుణమాఫీ ఇంకా 60 శాతం మంది రైతులకు కాలేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి.
అద్భుత ఆవిష్కరణ రైతుఖాతా..
దఫదఫాకు వెళ్లే పనిలేకుండా.. దళారుల గొడవ లేకుండా.. పైరవీకారుల పీడలేకుండా ప్రభుత్వానికి, రైతుకు మధ్య అనుసంధానంగా కేసీఆర్ చేసిన అద్భుత ఆవిష్కరణ రైతుఖాతా! రైతుపేరు, పట్టాదారు పాస్ పుస్తకం, భూ విస్తీర్ణం, ఆధార్, ఫోన్ నంబర్ ఇలా పూర్తి వివరాలతో రూపొందించిన ఈ బ్యాంకు ఖాతాతో రైతుబంధు, రుణమాఫీ, పంట కొనుగోలు పైసలు, పంట రుణాలు.. ఇలా నేరుగా ప్రభుత్వం నుంచి నగదును రైతుల ఖాతాల్లోకి వెళ్లే ఏర్పాటును కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం అందించే రైతు సంబంధిత ప్రతి ప్రయోజనం నేరుగా రైతుకే చెందింది. కేసీఆర్ సాధించి చూపిన ఈ అద్భుతం.. రైతులకు వరంగా మారింది.
దరఖాస్తులు మళ్లీమళ్లీ..
కాంగ్రెస్ రాగానే డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్‌కు మళ్లీ దయ్యంపట్టింది. ప్రతి సాయానికి పదేపదే దరఖాస్తులు పెట్టుకోవాల్సిన దుర్గతి ఏర్పడింది. బండి చక్రం తిరిగినట్టు ఉమ్మడి పాలననాటి కష్టాలు బతుకు చట్రంలోకి వచ్చి చేరాయి.
కరోనా కాలంలోనూ పంట కొనుగోళ్లు
పంటను పండించటమే కాదు.. పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నది. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.తొమ్మిదేండ్లలో రైతుల నుంచి 1.34 లక్షల కోట్ల విలువైన 736.99 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 2014-15లో కేవలం 24.29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా 2022-23లో ఇది 130.84 లక్షల టన్నులకు పెరిగింది. మరిప్పుడు ఏం జరుగుతున్నది?
యాసంగి వడ్లను కొనేనా?
వానకాలం ప్రైవేట్ వ్యాపారులు ఆదుకోకపోయి ఉంటే రైతు బతుకు అగాథమే అయి ఉండేది. అప్పుడంటే సన్నవడ్లు! మరి ఈ యాసంగి వడ్లను సర్కారు కొంటుందా? కనీసం గన్నీ బ్యాగులైనా ఇస్తుందా?
రైతుబంధు ద్వారా ఊతమిచ్చిన కేసీఆర్
‘తెలంగాణ బాగుపడాలంటే ముందు రైతు బాగుపడాలె’ అని సంకల్పించిన కేసీఆర్.. ఇందుకోసం వ్యవసాయరంగంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిష్ణాతులైనవారితో సమాలోచనలు చేశారు. ‘పంట కార్తెకు ముందే నేరుగా డబ్బు ఇస్తే.. రైతు తనకు అనువైన విధంగా ఖర్చుపెట్టుకునే వీలుంటది.. ఈ ఆర్థిక సాయాన్నే ప్రభుత్వపరంగా చేయాలనుకుంటున్నం’ అని కేసీఆర్ వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ నిపుణుడైన అశోక్ గులాటీకి చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పటి దాకా రైతులకు ఎరువులు, విత్తనాలు సహా సబ్సిడీల రూపంలో ఇస్తున్నా అవి నేరుగా ఉపయోగపడిన దాఖలాలు తక్కువేనని, డబ్బు రూపంలో సాయం చేస్తే అంతకన్నా గొప్పసాయం ఏముంటుందని అశోక్ గులాటీ సైతం కీర్తించారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ఉన్నత ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ‘పెట్టుబడి సాయం’ ద్వారా రైతులకు తొలిసారిగా తెలంగాణలోనే ఆర్థిక సాయం అందింది. అదే రైతుబంధుగా 2018లో ప్రారంభమైంది. ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున ప్రతి రైతుకు అందిన రైతుబంధు, తెలంగాణ వ్యవసాయరంగంలో పెను విప్లవాన్ని సృష్టించింది. 11 విడతల్లో ప్రతి విడతలోనూ 70 లక్షల మంది రైతులకు రూ.72,808 కోట్ల పెట్టుబడి సాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. పథకాన్ని ప్రారంభించిన 2018 నుంచి వరుసగా ఆరేండ్లపాటు సాలీనా రూ.15 వేల కోట్లను కేటాయించింది. చినుకు రాలకముందే రైతుబంధు చేతిలో పడేది. వానకోసం చూడకుండా చెరువు అదెరువు అయ్యేది.
రైతు వెన్ను విరిచిన కాంగ్రెస్
‘ఎకరానికి రైతుబంధు కింద కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలు కాదు.. రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తం’ అంటూ ఎన్నికల్లో హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులకు మొండి‘చెయ్యి’ చూపింది. ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ‘అంతా తూచ్.. 15 వేలు కాదు.. 12 వేలే ఇస్తామని రైతుల నమ్మకంపై నీళ్లు పో సింది. ఇప్పుడు ఆ 12 వేలు కూడా వచ్చుడు గగనమైంది. నాడు 10 వేలు ఠంచనుగా వస్తే.. నేడు కొండకెదురు చూసినట్టు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ‘నమ్మినానబోస్తే పుచ్చి బుర్రెలు’ అయినట్టు రైతుభరోసా ఆకాశ దీపమైంది. ఇప్పటికే వానకాలం రైతుబంధును ఎగ్గొట్టిన కాంగ్రెస్, యాసంగిలో ఇప్పటికీ రైతులకు సాయం అందించలేదు.
రైతులను ఏకం చేసిన వేదికలు
అసంఘటితంగా ఉన్న రైతులను ఏకం చేసి తద్వారా అద్భుతాలు సృష్టించాలన్న కేసీఆర్ స్వప్నం రైతు వేదికల రూపంలో తీరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలను నిర్మించింది తెలంగాణ మాత్రమే! ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున తెలంగాణ వ్యాప్తంగా 2,601 రైతు వేదికలు నిర్మితమయ్యాయి. ఇందుకోసం రూ.572 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం ఖర్చుచేసింది. రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేసి మార్కెట్లో డిమాండ్ గల పంటలను పండించేలా, ఆ పంటలను రైతులే మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రైతు వేదికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,06,501 రైతు శిక్షణా తరగతుల్లో 23,25,767 మంది రైతులు శిక్షణ పొందారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని కేసీఆర్ సర్కారు నియమించింది. తెలంగాణ ప్రాధాన్యత ఏమిటో? ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమో? హెచ్సీసీలో 2017, జూన్ 25న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించిన ‘రైతుహిత’ పేరిట నిర్వహించిన సమావేశంలోనే స్పష్టం చేశారు.
రైతులను జైల్లోవేసిన కాంగ్రెస్
ఇవ్వాళ కాంగ్రెస్ సర్కార్‌కు ఎవరు ముఖ్యమో? లగచర్ల ఉదంతాన్ని చూస్తే తెలిసిపోతుంది! కాంగ్రెస్ పాలనలో రైతు సోదరులు జైళ్లలో, పోలీస్ స్టేషన్లలో సేదదీరుతున్నారు. అన్నదాతల చేతులకు కరుకు బేడీలు కనిపిస్తున్నాయి. వారి వీపులపై లాఠీలు తాండవమాడుతున్నాయి.
కేసీఆర్ బీమా.. రైతులకు ధీమా
తెలంగాణను తన కుటుబంగా భావించిన కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకున్నడు. వృత్తికారులకు బీమా ఉన్నట్టే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకొని తాము బతుకుతూ ఇతరులకు బతుకునిస్తున్న రైతులకు బీమా ఉండని స్థితి వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఏ కారణంచేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడేదుస్థితి! ఈ బాధల నుంచి రైతు కుటుంబాలు బయటపడాలని కేసీఆర్ తలపోశారు. వృత్తికారులకు బీమా సౌకర్యం ఉన్నట్టే రైతన్న కుటుంబానికి కూడా బీమా ఉండాలని పట్టుబట్టారు. రైతు నయపైసా కట్టకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. ఏ కారణం వల్ల రైతు మరణించినా (సహజ మరణం అయినాసరే) బీమా సొమ్ము నేరుగా రైతు కుటుంబాలకు వెళ్లేవిధంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందేలా చేశారు. 2018 నుంచి 2023 దాకా మరణించిన 1,00,782 రైతులకు చెందిన కుటుంబాలకు రూ.5039.10 కోట్ల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ హయాంలో అందించారు.
కిస్తీ కూడా కట్టని కాంగ్రెస్
కానీ, ఇవ్వాళ రేవంత్‌రెడ్డి సర్కార్ కనీసం రైతుబీమా కిస్తీ కూడా కట్టలేని దుర్భరస్థితిలో ఉన్నది. కాలం చేసిన కార్యం కాకముందే అందే రైతుబీమాకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. అసలు ఈ పథకమైనా ఉంటదో? లేదో? తెల్వని అయోమయం నెలకొన్నది.
నిరంతర వెలుగులు పంచిన కేసీఆర్
‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే ఈ ప్రాంతం అంధకారమవుతది’ అని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హేళన చేసిండు. తెలంగాణ వస్తే పవర్‌కట్ అయితదని పవర్‌పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చిండు. అలాంటి కటిక చీకట్లో తెలంగాణ అనతికాలంలోనే వెలుగు జిలుగుల తెలంగాణగా మారింది. కేసీఆర్ దార్శనికత..దూరదృష్టితో రాష్ర్టాన్ని, రైతులను విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించారు. రైతులకు ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇదొక చరిత్ర! వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 75 వేల కోట్లను కేసీఆర్ ప్రభుత్వం ఖర్చుచేసింది. 2014 నుంచి రైతులకు విద్యుత్తు సబ్సిబీ పేరిట రూ.36,889 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది. అది కాకుండా రూ.38 వేల కోట్లతో విద్యుత్తు రవాణా, ట్రాన్స్ఫార్మర్స్, వైర్ లైన్ల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు తదితర ఆధునికీకరణ పనుల కోసం ఖర్చుచేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 8.17 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను ఇవ్వటంతో వాటి సంఖ్య 27.20 లక్షలకు చేరింది. ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టింది.
అప్రకటిత కరెంట్ కోతలు.. గంటల తరబడి పడిగాపులు
కానీ ఇవ్వాళ రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు పునరావృతమవుతున్నాయి. రైతుల కండ్లు గప్పి కాంగ్రెస్ సర్కారు డ్యాన్స్ చేస్తున్నది. కరెంట్ ‘ఇస్తునా… వద్దా?’ అని దాగుడుమూతలు ఆడుతున్నది. కరెంట్ కోసం రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతే బాగుచేసుకోవాల్సిన కాలం మళ్లీ దాపురించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిన కరెంట్ కష్టాలను తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తెచ్చి చూపుతున్నది. అదీ విషాదం
స్వర్ణయుగాన్ని ఆగం చేసిందెవరు?
ఇవాళ తెలంగాణలో లేనిదేమున్నది? సారవంతమైన భూమి, కష్టపడే రైతు, సమృద్ధిగా కురిసిన వానలు, రికార్డు శాతం ప్రవహరించిన నదులు, నీటి నిల్వకు పుష్కలమైన జలాశయాలు, అద్భుతంగా పనిచేసే అధికారులు.. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు ఇవ్వాల తెలంగాణ రైతాంగం ఎందుకు ఏడుస్తున్నది? నీళ్ల కోసం ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నది? ఎర్రటి ఎండల్లో చిమ్మ చీకట్లు ఎందుకు కమ్ముకుంటున్నాయి? తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆగం చేసిన అసమర్థులెవరు? పదేండ్ల పాటు లేని ఈ దుస్థితి ఇప్పుడే ఎందుకు దాపురించింది? ఇందుకు కారకులు ఎవరు? కారణం ఏమిటి? కాంగ్రెస్ సర్కారు చేతగాని తనం కాదా!l నాడు కార్తెకు ముందే ఎరువులు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పదేండ్ల పాటు కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్తెకు ముందే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సమీక్షలు నిర్వహించి పంట డిమాండ్‌కు కావాల్సిన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. పంట కాలానికి ముందే ఈ ఏర్పాట్లు చేయటం వల్ల రైతులెవరూ వాటి కొరతను అనుభవించలేదు. కానీ ఇవ్వాళ తెలంగాణ మళ్లీ ఉమ్మడి రాష్ట్రపు జ్ఞాపకాలను అనుభవిస్తున్నది. రైతులు చెప్పులు, పాస్ పుస్తకాలను లైన్లో పెట్టి ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. పోలీస్ స్టేషన్లో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినట్టే ఇవ్వాళ పోలీసుల రక్షణలో కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎరువులు, నకిలీ విత్తనాల బెడద నుంచి రైతును కాపాడేందుకు దేశంలో మరే రాష్ట్రం చేయని సాహసాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో రైతును మోసం చేసినవాళ్లెవరైనా సరే.. ఊచలు లెక్కబెట్టాల్సిందేననే కఠిన నిర్ణయం తీసుకున్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. కానీ, ఇవ్వాళ రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి నకిలీలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. అదీ మొలకెత్తుతున్న నకిలీ కాంగ్రెస్ విత్తనశుద్ధి
దేశానికే అన్నపూర్ణ
ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా మారింది. ఆ మార్చిన ఘనత కేసీఆర్‌ది. రైతుబంధు, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణ దేశానికే ధాన్యాగారమైంది. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. వరి సాగు 2014-15తో పోల్చితే 231 శాతం పెరిగితే.. ధాన్యం ఉత్పత్తి 280 శాతం పెరిగిందని ఇటీవలి ఆర్బీఐ నివేదిక తేటతెల్లం చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014-15లో వరి సాగు 34.97 లక్షల ఎకరాలు కాగా, ధాన్యం ఉత్పత్తి 76.93 లక్షల టన్నులు వచ్చింది. 2022-23 నాటికి వరి 121 లక్షల ఎకరాలకు పెరిగితే.. ధాన్యం ఉత్పత్తి 266.20 లక్షల టన్నులకు చేరింది. ఈ లెక్కన వరి సాగు 86.03 లక్షల ఎకరాలకు, ధాన్యం ఉత్పత్తి 189.27 లక్షల టన్నులకు పెరిగింది.
పంటను కాపాడుకునేందుకు అరిగోస
కానీ, ఇప్పుడు పంటలకు సాగునీళ్లందక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎండిపోతున్న పంటలను దక్కించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. పంటను కాపాడుకోవటం కోసం కలెక్టర్ల వద్ద ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాత గుండె చెదిరి గోడుగోడున ఏడుస్తున్నడు.
తెలంగాణ జీవధారగా కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తదేనన్నరు.. ఒక్క పిల్లర్‌కు పర్రె పడితే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని గాయిగాయి చేసిండ్రు. ఇగ ఈ ప్రాజెక్టే పనికిరాదని గత్తర లేపిండ్రు. కానీ, ఇవ్వాళ మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డగా మారింది. కాళేశ్వరంలో భాగంగా తవ్విన జలాశయాలు, కట్టిన పంప్‌హౌస్‌లు, పెట్టిన బాహుబలి మోటర్లు, కాల్వలే తెలంగాణ బీడు భూములకు జీవధార అవుతున్నాయి. ఒక్క ఎకరం కూడా అదనంగా పారలేదని కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ అవహేళన చేస్తే తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 97.48 లక్షల ఎకరాలకు సాగునీటి పారకం పెరిగిందని ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఆర్బీఐ వెల్లడించిన లెక్కల ప్రకారం 2014-15లో కేవలం 62.49 లక్షల ఎకరాలకు మాత్రమే తెలంగాణలో నీటి పారకం ఉంటే 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సాగునీటి గోస తీర్చడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సహా సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1,64,210 కోట్లు వెచ్చించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించడం ద్వారా వాటికి పూర్వవైభవం వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 46,500 చెరువులను దశలవారీగా బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో 15.05 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. 9.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, చెక్‌డ్యాములను నింపటం.. నడి ఎండాకాలంలోనూ మత్తడి దుంకిన చెరువులు.. అలుగుబారుతున్న చెరువుల్లో దుంకులాడిన జలపుష్పాలు.. మొత్తంగా ప్రాజెక్టుల వల్ల 17.23 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరగడంతో మొత్తం 98 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందినట్టు ఆర్బీఐ చెప్పిన గణాంకాలతో తెలంగాణ గల్లా ఎగురేసింది.
పొలాలకు నీళ్లివ్వని దౌర్భాగ్యం
ఇవ్వాళ కేసీఆర్‌కు పేరొస్తదని కాళేశ్వరాన్ని పండపెట్టి.. పొలాలను ఎండబెడుతున్న కాలం! చెరువు కట్టలపై మళ్లీ సర్కారు తుమ్మలు! తూముల దూప తీర్చని దుస్థితికి చెరువులు! కృష్ణాలోనీళ్లున్నా.. పాలమూరు పంపులు సిద్ధంగా ఉన్నా పొలాలకు నీళ్లివ్వలేని దౌర్భాగ్యం! కాంగ్రెస్ పాలన తీరిది!
పంట గొర్రెలపాలు
లక్షా 80 వేలు పెట్టి సాగు చేసిన పంట.. సాగునీరందక కండ్ల ముందే ఎండిపోయింది. దీంతో రూ.18 వేలకే గొర్రెల మేత కోసం ఇలా వదిలేశాడు రైతు సంగెం బాలయ్య. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని దృశ్యమిది.
కాలుతున్న మోటర్లు
కరెంటు కోతలు, సాగునీటి వెతల నేపథ్యంలో పంటలు కాపాడు కునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లోడ్ పెరిగి వ్యవసాయ బోర్లు కాలి పోతున్నాయి. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం రిపేరు కోసం రైతులు తీసుకువచ్చిన మోటర్లివి.