హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. ఉద యం నుంచి కేసీఆర్ సమావేశంలో ఏం మా ట్లాడాతారనే దానిపైనే సీఎం ఫోకస్ పెట్టారు. ఆయన పేరుకే రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నా, ధ్యాసంతా కేసీఆర్ సమావేశం, ప్రెస్‌మీట్ చుట్టే తిరింది. క్షణక్షణం తన అనుకూల మీడియా, ఇంటెలిజెన్స్ వర్గాలతో సమాచారం తెప్పించుకొని.. కేసీఆర్ లేవనెత్తిన అంశాలు, సంధించిన ప్రశ్నలపై చర్చించేందు కు సీఎం రేవంత్ సోమవారం హుటాహుటిన మంత్రులతో భేటీ కావాలని నిర్ణయించారు. అంటే కేసీఆర్ వ్యాఖ్యలతో ఇటు సర్కారులో అటు రేవంత్‌లో ఎంత అలజడి, ఆందోళన మొదలైందో అర్థమవుతున్నది. ఆదివారం సా యంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారనే సమాచారం అందగానే సంజాయిషీ ఇచ్చుకొనే ప్ర యత్నాలు మొదలుపెట్టారు. సీఎం తొలుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ను పురామాయించారు.
కేసీఆర్‌కు కౌంటర్ ఇవ్వాలంటూ ఆదేశించారు. ఉత్తమ్ ప్రెస్‌మీట్ పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పదలుచుకుంది చెప్పరు.. చెప్పినా ఎవరికీ అర్థంకాదు. ఈ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవేవో అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయారు. దీంతో ఉత్తమ్ ప్రెస్‌మీట్ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ కాలేదని భావించిన సీఎం రాత్రిపూట ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. తన అనుకూల మీడియా ప్రతినిధులను ఇంటికి పిలిపించుకొని చిట్‌చాట్ పేరుతో సంబంధం లేని అంశాలపై మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రేవంత్‌కు గల అవగాహనపై అనేక అనుమానాలున్నాయి. అందుకే సీఎం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై, కృష్ణా జలాలపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తనకు అలవాటైన తీరులో కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివిధ రూపాల్లో రూ.8లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ఆరోపించారు. అంతకుముందు కేసీఆర్ తన ప్రెస్మీట్లో అప్పులపై స్పష్టతనిచ్చారు. తమ ప్రభుత్వం రూ.2.5లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసినట్టు ‘కాగ్’ చెప్పిన లె క్కల్ని ఉద్ఘాటించారు. మరోసారి కేసీఆర్ కు టుంబంలో చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను ఇంట్లో వాళ్లు బంధించారని, అందు కు ఆయన బయటకు రావడం లేదంటూ ప్రేలాపనలు చేశారు. ఒకవేళ సీఎం చెప్పిందే నిజమైతే.. కేసీఆర్ ఈ రోజు బయటకు ఎలా వచ్చారు? ప్రెస్‌మీట్ ఎలా పెట్టారో సీఎం సమాధానం చెప్పాలి. ఇక కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ‘ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపు కర్రతో కొడతా.’ నంటూ తనకు అచ్చొచ్చిన భాషతో విపరీత వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్‌కు మోదీ ఎరువు అందుతుంది.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, అరవింద్‌కుమార్‌పై విచారణ డీఓపీటీ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. సాగునీటి విషయంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ధోకాపై ప్రజల్లోనే తేల్చుకునేందుకు బహిరంగ సభలు నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అంతే రేవంత్ వెన్నులో వణుకు మొదలైనట్టున్నది. ఆయన బయటకు వచ్చి గంటపాటు ప్రెస్‌మీట్ పెడితేనే ఇలా ఉందంటే.. ఇక ఆయ న బహిరంగ సభలు పెడితే కాంగ్రెస్ సర్కారును ఉతికి ఆరేయడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన రేవంత్.. బహిరంగ సభలు పెట్టకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలు పెట్టొద్దు.. అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటూ విన్నపాలు చేశారు. ఇందుకోసం జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తానని కూడా చెప్పారు.