తలాపునే గోదారి ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నాడు సాగు, తాగునీటికి విలవిల్లాడారు. కృష్ణానది సమీపానే ఉన్నా అంతంత మాత్రంగానే నీటి సదుపాయం కలిగింది. మొత్తంగా ఉమ్మడి పాలనలో సాగునీటి వసతుల కల్పనలో ఈ జిల్లా తీవ్ర అన్యాయానికి గురైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఈ జిల్లా దశ మారింది. కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనున్నది. కరువు పీడిత ప్రాంతాల దాహార్తి తీరుతున్నది. సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు కావడంతో ఆనాటి కేసీఆర్ సంకల్పం నేడు నెరవేరనున్నది.
Sitarama Project | హైదరాబాద్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ): నాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు నీటి కుట్రలకు నిదర్శనంగా మిగిలాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అంతర్రాష్ట్ర, మరొకటి వన్యప్రాణి అటవీ ప్రాంతం అనుమతుల సమస్యలతో నిరర్థకంగానే మిగిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలను సమీక్షించారు. ఈ రెండు పథకాల్లోని లోపాలు, సాంకేతిక సమస్యలను గ్రహించారు. అంతర్రాష్ట్ర, వన్యప్రాణి అటవీ ప్రాంతం అనుమతుల సమస్యలను శాశ్వతం గా అధిగమించడానికి కేసీఆర్ ఆ రెండు ప్రాజెక్టులను రీఇంజినీరింగ్ చేయించారు.
ఒకే సమీకృత ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించి దానికి సీతారామ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు.70 టీఎంసీలను ఎత్తిపోయడం ద్వారా గతంలో ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టుతోపాటు అదనంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్, పాలేరు, బయ్యారం ప్రాజక్టుల కింద 46,187 ఎకరాలు, పాలేరు ప్రాజక్టు ద్వారా నాగార్జునసాగర్ ప్రాజక్టు ఆయకట్టు 2,37,573 ఎకరాల స్థిరీకరణతో చిన్ననీటి చెరువుల కింద 1,35,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేలా పథకాన్ని రూపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా దీనిని తీర్చిదిద్దారు.
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలోని 25 మండలాల్లో , వరంగల్ జిల్లాలోని ఒక మండలంలో స్థిరీకరణ సహా మొత్తం 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు, వందలాది గ్రామాలకు తాగునీరు అందనున్నది. 2018 ఫిబ్రవరి 16న ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రాజెక్టు పనులకు స్వయంగా శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సీతారామ లిఫ్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ సీజన్లో మొదట సత్తుపల్లి కాలువకు నీళ్లిచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా దమ్ముగూడెం దిగువన 37 టీఎంసీల సామర్థ్యంతో సీఎం కేసీఆర్ సీతమ్మసాగర్ బరాజ్‌ను ప్రతిపాదించారు. పనులు పూర్తయితే మొత్తంగా ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం కానున్నది.
సీతారామ ప్రాజెక్టు అనుమతుల సాధనకు సైతం ఆనాడు కేసీఆర్ సర్కారు విశేష కృషి చేసింది. కేంద్ర జల సంఘం అనేక కొర్రీలు పెట్టినా వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకుపోయింది. వాస్తవంగా కేంద్రం రివర్ బోర్డుల గెజిట్‌ను 2021లో విడుదల చేసింది. దాని ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలల్లో అనుమతులను సాధించుకోవాల్సి ఉన్నది. ఆ మేరకు కేసీఆర ప్రభుత్వం సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌ను 2022లోనే సీడబ్ల్యూసీకి సమర్పించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర నదీ జల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అండ్ ఎస్టిమేషన్, భూగర్భజల, పర్యావరణ మంత్రిత్వ, అటవీ, కాలుష్యనియంత్రణ శాఖలు కలిపి మొత్తంగా 18 డైరెక్టరీల నుంచి అనుమతులను సాధించింది. అయితే కేవలం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే టెక్నికల్ అప్రయిజల్ కమిటీ తుది అనుమతులే మిగిలిపోయాయి. అనంతరం సుదీర్ఘకాలంపాటు టీఏసీ సమావేశమే కొనసాగలేదు. తాజాగా నిర్వహించిన టీఏసీ సమావేశంలో ప్రాజెక్టుకు తుది అనుమతులు సైతం మంజూరయ్యాయి.
కేంద్ర జలశక్తిశాఖ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి టెక్నికల్ అప్రయిజల్ కమిటీ (టీఏసీ) ఎట్టకేలకు సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు తుది అనుమతులకు ఆమోదముద్ర వేసింది. ఢిల్లీలోని ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి నేతృత్వంలో జరిగిన 158వ టీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. సమావేశానికి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభా గం గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్ హాజరై ప్రాజెక్టు ప్రత్యేకతలను వివరించారు. దీంతో టీఏసీ కమిటీ తుది అనుమతులు చేసింది. అనుమతుల మం జూరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర జలశక్తి శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులను అభినందించారు.