హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (ఎస్) అగ్రనేత కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో తాము బీఆర్ఎస్ మద్దతుతో ముందుకు వెళ్తామని తెలిపారు. జనతాదళ్‌తో కలిసి నడుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, ఆయన మద్దతుకు కృతజ్ఙతలు అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలిపారన్నారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టారని.. రికార్డు సమయంలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ ఆలోచనాధోరణి, ఆయన చిత్తశుద్ధి అద్భుతమని చెప్పారు. దసరా నాడు బీఆర్ఎస్ పేరుకు అంకురార్పణ జరిగిందని, ఇప్పుడు జాతీయ పార్టీగా ఎన్నికలసంఘం నుంచి గుర్తింపు లభించి ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రెండు సందర్భాల్లోనూ తాను తెలంగాణభవన్‌కు వచ్చానని గుర్తుచేసుకున్నారు. దేశం కోసం కేసీఆర్ వెంట జనతాదళ్ (ఎస్) కూడా సాగుతుందని కుమారస్వామి ప్రకటించారు.
తెలంగాణలో పుట్టి..
తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ వృక్షం (టీఆర్ఎస్) శాఖోపశాఖలుగా నేడు భారతదేశమంతటా విస్తరిస్తున్నది. దేశ ప్రజలకు మన భారత రాష్ట్ర సమితి సంక్షేమం, అభివృద్ధి అనే చల్లని నీడను పంచనున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపనున్నది.
– టీ హరీశ్‌రావు, వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి
దేశ రాజకీయాల్లో నూతనశకం
భారత రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించి ప్రతి పౌరుడి లక్ష్యమైన సంఘటిత, సమైక్య, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గత 8 ఏండ్లలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా ప్రతీ భారతీయుడికి కలలు కనే ధైర్యాన్ని ఇచ్చేందుకు, ఆ కలలను నిజం చేసేందుకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఇది తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ మరో ప్రస్థానం.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ