KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తన ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్‌డే వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లుచేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల, పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.
ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణభవన్ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. తొలుత డప్పు కళాకారులు, గిరిజన వేషధారణలో నృత్యాల ప్రదర్శన, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్చేయనున్నట్టు చెప్పారు.
నేడు సామాజిక సేవా కార్యక్రమాలు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. పెద్దఎత్తున మొకలు నాటుతామని చెప్పారు. పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేసీఆర్ పేరున సర్వమత ప్రార్ధనలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనేక ప్రాం తాల్లో రైతులు వివిధ రకాలుగా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో యువనేత తలసాని సాయికిరణ్‌యాదవ్, నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్‌గౌడ్, పార్టీ నేతలు విప్లవ్‌కుమార్, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు కవితారెడ్డి, వెంకటేశ్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు వద్దిరాజు జన్మదిన శుభాకాంక్షలు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసి 70 ఏండ్ల కలను నిజం చేశారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని ప్రశంసించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన వృక్షార్చనలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రతీ తండాలో కేసీఆర్ బర్త్‌డే ; సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ పిలుపు
రాష్ట్రంలో తండాలను పంచాయతీలుగా మార్చి, 10 శాతం రిజర్వేషన్ పెంచి, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికం చేసి, గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అన్ని తండాలలో ఘనంగా నిర్వహించాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం కేసీఆర్‌ను సంజీవ్‌నాయక్ కలిశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తండాలలో అన్నదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాననే వారికి.. కేసీఆర్ తమకు చేసిన సాయం గురించి ఎలుగెత్తి చాటాలని వెల్లడించారు. అలాగే కేకులు కట్ చేసి, తమ విశ్వాసాన్ని చాటి చెప్పాలని మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను కోరారు.