హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు (KCR Birthday) మంగళవారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav) , యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) , డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ( Harish Rao) అతిథులుగా హాజరయ్యారు.

కేసీఆర్ 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి గా కేసీఆర్చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుందని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నామని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన చెప్పుకోదగ్గ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదని విమర్శించారు.
మూడేళ్ళ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.