హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలను తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హర్షం వ్యక్తంచేశారు. ఏప్రిల్ 6 నుంచి కేరళలో సీపీఎం జాతీయ మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆయన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ తీర్మానం ముసాయిదాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పునర్విభజనపై పార్లమెంటులో ప్రధాని మోదీ తెలుగు ప్రజలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయకుండా త్రిసభ్య కమిటీ వేయడం కంటితుడుపు చర్య అన్నారు. విభజన హామీలపై నిద్రలేవడానికి మోదీకి ఏడేండ్ల సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కర్ణాటకలో హిజాబ్ పేరుతో మత విద్వేషాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఐదు రాష్ర్టాల్లో బీజేపీకి శృంగభంగం తప్పదని చెప్పారు. వామపక్ష నాయకులు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్‌బాబా మాట్లాడటం హాస్యాస్పదమని, సమానత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని పేర్కొన్నారు. గిరిజన, దళితవాడలను సందర్శించిన తర్వాతే సమానత్వం గురించి మాట్లాడాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణను అవమానించే అర్హత మోదీకి, టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకునే అర్హత బీజేపీకి లేదని స్పష్టంచేశారు. మతం పేరుతో ఆందోళనలు సృష్టిస్తున్న బీజేపీని సమర్థంగా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.