హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకైన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే వేడుక కావాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆదివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను దేవతగా కొలిచే ఈ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదని పేర్కొన్నారు. ఎంగిలిపూలతో మొదలై, సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగతో పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా మహిళలు, పిల్లాపాపలతో సాంస్కృతిక సందడి నెలకొంటుందని తెలిపారు. సబ్బండ జనుల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ సాధనోద్యమంలో బతుకమ్మ కీలకభూమిక పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆకాంక్షలకు అద్దంపడుతూ సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర మహిళల ప్రత్యేక వేడుకగా గుర్తించి బతుకమ్మ చీరల పేరిట కానుకలు అందించి వారి సంతోషంలో పాలుపంచుకున్నదని పేర్కొన్నారు. ఈ ఏడు బతుకమ్మను ఆడబిడ్డలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రకృతిమాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అభిలషించారు.
మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు: కేటీఆర్
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించినట్టు గుర్తుచేశారు. దీంతో బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.