హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదని పేర్కొన్నారు. దేశ సంపదను సృష్టించడంలో వారి పాత్ర గొప్పదని తెలిపారు. అనేక కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని అభివర్ణించారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు, వారి సాధికారతకు దోహదం చేశాయని గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాల్లో మహిళకే ప్రాధాన్యతనిచ్చామని, వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని, తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మహిళాసాధికారతకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. వారిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దితేనే తెలంగాణ అభివృద్ధి పథాన పయనిస్తుందని సూచించారు.