రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం, నాడు ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తిచేయకుండా ఉద్దేశపూర్వకంగా సాగదీయడం వంటి వాటిపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది.
ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పట్టించుకోకుండా వదిలివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది.
ఇందులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఏం చేయాలన్న అంశంపై చర్చించనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరఫున పోరాటం చేసే అంశంపై చర్చిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పకనబెట్టడంతోపాటు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులకు కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతున్న విధానాన్ని పార్టీ శ్రేణులకు, నాయకులకు వివరిస్తారు.
రాజకీయ దురుద్దేశంతో అన్నదాతలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా ప్రభుత్వం చూపుతున్న అలసత్వం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం, 90 శాతానికిపైగా పూర్తయిన ఈ ప్రాజెక్టును గడిచిన 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయకపోవడం, దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు జరుగుతున్న నష్టాన్ని కేసీఆర్ వివరించనున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగుబాటుకు గురైతే, 18 నెలలుగా ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయకుండా తాత్సరం చేయడంపై కూడా చర్చించున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రత్యేకంగా ఉద్యమ కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్టు సమాచారం.