KTR | సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు.. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటానని అన్నారు. రేవంత్ ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, మనువడి గురించి మాట్లాడనని తెలిపారు. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని విషయాలపై కేసీఆర్ రేపు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మీడియా అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం స్థానాల్లో గెలిచినట్లు రేవంత్ రెడ్డి చెబుతున్నది నిజమైతే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు రావాలని సవాలు విసిరారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదని కేటీఆర్ తెలిపారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకనే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలను గెలిచామని పేర్కొన్నారు. అదే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శించారు. తాను ఐరెన్ లెగ్ కాదని.. రేవంత్ రెడ్డి, రాహుల్‌గాంధీలు ఐరన్ లెగ్‌లు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక అని అన్నారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదని అన్నారు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీల్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని ఆరోపించారు. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లు చేయాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ముఖ్యమంత్రికి స్పష్టత లేదని అన్నారు.
2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కిట్టీ పార్టీ ఆంటీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి అర్థమైందని అన్నారు. రేవంత్ రెడ్డి దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రాకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లిపోయిందని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. టైమ్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా ఇవ్వమని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకేమీ లేదని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులు బీసీలకు ఇచ్చింది మేమే అని తెలిపారు. రాజకీయం వేరే.. విద్య, ఉపాధిలో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
అఖిలేశ్ యాదవ్ మా పాత దోస్త్ అని కేటీఆర్ తెలిపారు. అఖిలేశ్‌ను కలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్వయంగా అన్నారని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పోయాడో రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లలో జరుగుతున్నాయో తెలుసని అన్నారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులో రేవంత్ రెడ్డి ఇల్లు రీమోడల్ చేయించిందే బీజేపీ అని తెలిపారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కాంట్రాక్టులు ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక కాలు కాంగ్రెస్‌లో.. మరో కాలు బీజేపీలో ఉందనన్నారు. కిషన్ రెడ్డితో మాకు అండర్ స్టాండింగ్ ఉంటే.. కిషన్ రెడ్డి మాకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.