CM KCR | ‘సారును ఇడిశేది లేదు.. పదేండ్ల కిందటి లెక్క మల్ల సావుమర్నం అయ్యేది లేదు. పేదోల్లకు కూడు, గూడు.. సకులం సగవెడుతున్నది దేవుడసొంటి ఆ అయ్యనే. పేగు బంధమోలె మమ్మల్ని కాపాడుకుంట మా ఆయుష్షు పెంచుతాండు. మల్లా మల్లా సారునే గెలిపించుకుంటం’ అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లికి చెందిన ఏడుపదుల అవ్వ పెద్దగంట లక్ష్మి. పెనిమిటి కాలం జేస్తే.. ఆసరా పింఛన్లతోని దివ్యాంగుడైన కొడుకుని సాదుకుంటున్న లక్ష్మి తన మనోగతాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే…
నా పెనిమిటి పెద్దగంట బాలయ్య గౌడ్ గీత కార్మికుడు. బతికినంత కాలం కుల వృత్తినే నమ్ముకున్నడు. ఇంటికి ఏ లోటూ రాకుండ జూసుకునేటోడు. మాకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు వెంకట్‌గౌడ్ హైదరాబాద్‌లో పని జేస్తడు. దివ్యాంగుడైన పెద్ద కొడుకు గురించే ఎప్పుడూ నా పెనిమిటి రంది పడేటోడు. ఒంట్లో బాగాలేక 2015లో నా పెనిమిటి కాలం జేశిండు. అప్పటిసంది మాకు కష్టాలు మొదలైనయి. తిండికి కష్టమయ్యేది. కేసీఆర్ సారు ఇచ్చే పింఛినీ పైసలతోని తిండిగింజలు కొని బతుకుతున్నం.
దివ్యాంగుడైన కొడుకుని సాదుకుంట కిరాయి ఇంట్ల బిక్కుబిక్కుమని బతుకుతుండె. నెలంతా మంచిగ ఉన్నా.. ఒకటో తారీఖు వస్తే గుబులు అయ్యేది. ఇంటి కిరాయి తల్సుకుంటే వణుకు పుట్టేది. వయోభారంతో కదల్లేకున్న నన్ను, దివ్యాంగుడైన నా కొడుకు దీనస్థితిని చూసి మానవీయ ప్రభుత్వం చలించింది. అగ్గిపెట్టె లాంటి అర్రలల్ల మా అసంటోళ్లు నలిగిపోవుడు సూడలేక.. కేసీఆర్ సారు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిచ్చిండు. పేదోళ్లను పెద్దింటోళ్లుగా చేస్తనన్న సారు.. చేసి చూపెట్టిండు. గొల్లపల్లి-ఎల్లారెడ్డిపేట దారిపొంటి కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లల్ల్ల ఒక ఇల్లు ఇచ్చి మాకు నీడ కల్పించిండు.
సారు సల్లంగుండాలె..
అయ్య(కేసీఆర్ సారు) ఇల్లు ఇచ్చిండు.. ఇంటినీ నడిపిస్తున్నడు. ఇప్పుడు సొంత ఇంట్ల నిమ్మలంగ ఉంటున్నం. నాకు రూ.2016, నా కొడుక్కి రూ.4016 పింఛను ఇస్తుండ్రు. రేషన్ బియ్యంతో అల్కగ బతుకుతున్నం. ఎవ్వలమైన తిన్న రేవు తల్వాలె. అప్పుడే ఇంత అన్నం పుడుతది. అయ్యలు (కేసీఆర్, కేటీఆర్) లేకుంటె ఈపాటికి మట్టిల గలిశి, పేరు మాశెటోళ్లం. సన్న బియ్యం, మంచి వైద్యం, బీమా, నా అసొంటోళ్లకు 5 వేల దాకా, నా కొడుకు అసొంటోళ్లకు రూ.6 వేల దాక పింఛినీ పెంచుతరంట. ఆ అయ్యలు సల్లంగుండాలె. ఈ తాప గుడ్క అయ్య సర్కారె వస్తది. (ఈ మాటలు చెబుతుంటే కేసీఆర్ సర్కారు మీద పేగు బంధానికి మించిన భావోద్వేగం పెద్దమ్మ కండ్లల్లో కనిపించింది.)
…? ఇల్లెందుల దుర్గాప్రసాద్