Padi Kaushik Reddy | నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో విడత దళితబంధు ఇవ్వాలని కోరామని చెప్పారు.
మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని కాంగ్రెస్ నేతలను పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడుతామని స్పష్టం చేశారు. రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సంజయ్‌కు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌తో గెలవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని నిలదీశారు. వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులతో పాటు ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు.
BRS MLA Padi Kaushik Reddy and Jagitial MLA Dr Sanjay engage in a fight over which party the later belongs to, in a review meeting of erstwhile Karimnagar district pic.twitter.com/Td8Ncenoll
— Naveena (@TheNaveena) January 12, 2025
కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల గురించి చర్చ సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్‌ను కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. దళితులు, రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త తోపులాటకు దారితీయడంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆయన్ను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లడం గమనార్హం.