హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కే చంద్రశేఖర్‌రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకొన్నారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి శేష వస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. టీటీడీ సహకారంతో కరీంనగర్లో తెలంగాణ సీఎం 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తమ ఆస్తిగా భావిస్తారన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మూడోసారి కూడా ప్రజలు సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టంచేశారు.