ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 12: త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందజేస్తామని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తున్న కేసీఆర్‌కు తామంతా రుణపడి ఉంటామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న ఉద్యమకారులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను వందల కోట్ల ఆస్తులున్న నయా పెత్తందారుకు, వంద కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపిన నిరుపేద విద్యార్థికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. విద్యార్థి నాయకుడిని బానిస బిడ్డగా సంబోధించిన ఈటలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోయే సమయం దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నాయకులు స్వామియాదవ్, కొండ శ్రీమాన్, ప్రదీప్పటేల్, భరత్‌కుమార్, ఉపేందర్‌నాయక్, శివపటేల్, మధు, నాగరాజుగౌడ్, నరేశ్, బ్రహ్మం, శ్రీకాంత్, నాని తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి శక్తిని చాటాలి: తుంగ బాలు
పార్టీలు, సిద్దాంతాలు పక్కనపెట్టి అందరూ ఓయూ పరిశోధక విద్యార్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకుడిని గెలిపించుకుని విద్యార్థి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గెల్లును గుర్తించి అవకాశం కల్పించడం గొప్ప విషయమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను చూసి మిగిలిన పార్టీల నాయకులు నేర్చుకోవాలని హితవుపలికారు.