Arteries | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ధమనుల నాళాల గోడల ఆరోగ్యం నైట్రిక్ ఆక్సైడ్ పై ఆధారపడి ఉంటుంది. తగినంత నైట్రిక్ ఆక్సైడ్ ఉన్నప్పుడు ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాల ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సహజంగా లభించే కొన్ని రకాల పానీయాలు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు సహాయపడతాయి. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల ధమనుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు అదుపులో ఉండడం, గుండె పనితీరు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని పానీయాల గురించి అలాగే వాటిని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్రూట్ లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తరువాత నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది. ఇది ధమనుల ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా వృద్దులు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. రోజుకు 200 నుండి 250 ఎమ్ఎల్ బీట్రూట్ తాజా మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ధమనుల ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మందార టీ లో ఆంథోసయనిన్లు అధికంగా ఉంటాయి. మందార టీని తయారు చేసి తీసుకోవడం వల్ల ధమనుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ ఎండిన మందార రేకులు వేసి 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించి వడకట్టాలి. తరువాత ఇందులో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క లేదా నిమ్మరసం వేసి కలిపి తాగాలి. రోజుకు 1 నుండి 3 కప్పుల మోతాదులో ఈ టీని తీసుకోవచ్చు.
చక్కెర లేకుండా కోకో పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఎండోథెలియల్ పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని పాలు లేదా నీటిలో 1 నుండి 2 టీ స్పూన్ల కోకో పౌడర్ ను వేసి కలిపి తాగాలి. అయితే చక్కెరను, స్వీటెనర్లను తక్కువగా ఉపయోగించడం లేదా అస్సలు ఉపయోగించకపోవడం మంచిది.
ఉసిరి పానీయాన్ని తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్స్ నిష్పత్తిలో మెరుగుదల ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా ఇవి ధమనుల ఆరోగ్యానికి కూడా మద్దతును ఇస్తాయి. ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు ఉసిరికాయల ముక్కలను వేసి బాగా మరిగించి వడకట్టి తాగాలి లేదా ఒక గ్లాస్ నీటిలో ఉసిరికాయ పొడిని వేసి బాగా కలిపి తాగాలి. అయితే దీనిలో చక్కెరను కలపకుండా తీసుకోవడం మంచిది.
నిమ్మకాయ నీరు, ఆలివ్ ఆయిల్ ని కలిపి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు తగ్గుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫినోలిక్స్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ సి, ప్లేవనాయిడ్స్ ధమనుల ఆరోగ్యానికి, గుండెకు ఎంతో మద్దతును ఇస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఈ విధంగా ఈ పానీయాలను తయారు చేసి తీసుకోవడం వల్ల ధమనుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ పానీయాలు మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.