హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రెగ్యులర్గా జరిగే ఆరోగ్యపరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద దవాఖానకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. కేసీఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని పేర్కొన్నది. ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు దవాఖానలోనే ఉంటే బాగుంటుందని వైద్యులు ఆయనకు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు.
ఆయన స్వయంగా నడుచుకుంటూ దవాఖానకు వచ్చారు. డాక్టర్లతోనూ కేసీఆర్ సరదాగా మాట్లాడారని, తాను చెకప్ కోసం వచ్చానన్న విషయం తెలిసి ఫోన్ చేసినవారితోనూ ఆయనే స్వయంగా మాట్లాడారని దవాఖాన వర్గాలు తెలిపాయి. కేసీఆర్ దవాఖానకు రావడంపై యశోద సీనియర్ కన్సల్టెంట్, జనరల్ ఫిజీషియన్ ఎంవీ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టు కేసీఆర్ చెప్పడంతో దవాఖానలో చేరాల్సిందిగా సూచించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ వంటి వాటిని చెక్ చేయనున్నట్టు తెలిపారు. వైటల్ పారామీటర్స్ అన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు డాక్టర్ ఎంవీరావు ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. రక్తంలో చక్కెరస్థాయి కొంత అధికంగా ఉన్నదని, అది తప్ప మరే సమస్యా లేదని వెల్లడించారు. కేసీఆర్ వెంట కేటీఆర్, కుటుంబ సభ్యులు ఉన్నారు.