హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): చనాకా కొరాటా, సదర్మాట్ ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి 90 శాతానికిపైగా పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించి నెర్రెలిచ్చిన తెలంగాణ నేలను తడిపి దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత ఆయనేనని స్పష్టంచేశారు. ఆ రెండు ప్రాజెక్టులను తాజాగా సీఎం ప్రారంభించిన నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని కుదుర్చుకొని 2016లో 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చనాక కొరాటా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయని, 2023 సెప్టెంబర్‌లోనే తమ ప్రభుత్వం ట్రయల్న్ సైతం నిర్వహించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. 1.58 టీఎంసీల సామర్థ్యంతో సదర్మాట్ ప్రాజెక్టుకు కేసీఆర్ పాలనలోనే అంకురార్పణ జరిగి.. 90 శాతం పనులు కూడా పూర్తి చేశారని తెలిపారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందుతుందని తెలిపారు.