హనుమకొండ, డిసెంబర్ 5 : కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటం నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. దీక్షాదివస్‌లో భాగంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి తరానికి తెలంగాణ చరిత్ర, 60 ఏండ్ల అణచివేత, 14 ఏండ్ల కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటం, పదేండ్ల బీఆర్ఎస్ పాలన, సంక్షేమం, అభివృద్ధిని వివరించాల్సిన అవసరముందని చెప్పారు.
దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నేటి విద్యార్థులకు కేసీఆర్ పోరాటం, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ అభివృద్ధిని తెలిపేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారని, నాటి పోరాట దీక్ష స్ఫూర్తిగా ప్రతి ఏడాది11 రోజులపాటు దీక్షాదివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు నాడు ఉద్యమానికి కేంద్రాలయ్యాయని, కేసీఆర్ పోరాటానికి విద్యార్థులు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేశారు.