KCR | సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం అనుకుంటున్నావో అని మండిపడ్డారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎదవలు చావాలంటే కేసీఆర్ ఛస్తాడా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. చెరువులను బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి మొదలుపెడితే పదేళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. వట్టి మాటలు, గఫ్ఫాలు కొట్టుడు కాకుండా ఎన్నో చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడం, ఓట్లు అడగమని శాసనసభలో నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా అని అడిగారు. నేను చెప్పి.. ఐదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మారుమూల పల్లెల్లకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఐదేళ్లు మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందని ప్రశ్నించారు. నీళ్లు రావాలంటే.. లాగులు పలిగేదాకా సంపాలని సూచించారు. మంచి మాటకు కాకపోతే అంతే చేయాలన్నారు.
పొద్దున లేస్తే కేసీఆర్ సావాలని అంటాడని తెలిపారు. ‘ నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. నా కొడకా ఏం అనుకుంటున్నావో’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక కథ చెప్పారు. ‘ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతారు. ఆ ఉట్టి పిల్లికి అందదు. అందుకే పిల్లి శాపం పెడతది. తాడు తెగాలి. ఉట్టి పడాలి అని శాపం పెడతది. పిల్లి శాపానికి ఉట్టి పడతదా.. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా.. ఈ ఎదవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా ‘ అని ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు 75 ఏండ్లు వచ్చాయని తెలిపారని కేసీఆర్ అన్నారు. తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయి. అని తెలిపారు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, టాప్ టు బాటమ్ అన్ని వర్గాల వారు.. ఇది మా తెలంగాణ, మేం గర్వంగా బతుకుతాం.. మేం సంతోషంగా బతుకుతామని అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకుని చెప్పేదాకా మనం సేవ చేయాల్సిందేనని అన్నారు. చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
75 ఏళ్లు వచ్చాయంటే నడవడదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే.. ఇప్పుడు మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయిందని అన్నారు. యువకునిలా, అంతటి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోదామని సూచించారు.