సూర్యపేట : దేశంలో నెలకొన్న గడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పంథాలో హస్తినకు అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.సూర్యాపేట లో గురువారం మీడియా తో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ దేశరాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
2024 లో సరికొత్త శకానికి నాంది పడబోతుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం గాఢాంధకారంలోకి నెట్టివేయబడిందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలవడంతో దేశంలో బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఖమ్మం సభ సక్సెస్ తో అది నిరూపితమైందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికీ దేశంలో 35 శాతానికి పై బడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు దేశ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం లో జరిగిన సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.