హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆదివారం హాజరవుతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
చట్టపరంగా తనకు అనుకూలతలు ఉన్నాయని, విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని, కానీ మాజీ సీఎంగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా, బాధ్యతగల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి అంటించిన నోటీసులపై శనివారం సమాధానం ఇచ్చారు. ఎర్రవల్లికి కాకుండా నందినగర్ నివాసంలో విచారణకు పట్టుబట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
విషయం: క్రైమ్ నంబర్ 243/2024కు సంబంధించిన దర్యాప్తులో జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ ముందు హాజరు కావడం గురించి.
1. జనవరి 29వ తేదీన మీరు ఇచ్చిన నోటీసు (243/సీఆర్/పీఎస్-పీజీ/హెచ్‌వైడీ/24-26), దానికి ప్రతిగా అదేరోజు నేను ఇచ్చిన లేఖ, 30న మీరు ఇచ్చిన లేఖ గురించి.
2. మీరు జనవరి 29న ఇచ్చిన నోటీసులో నన్ను 30వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రదేశంలో విచారణకు అందుబాటులో ఉండాలని కోరారు. దానికి ప్రతిస్పందనగా అదేరోజు (29న) మీకు లేఖ పంపాను. ముందుగానే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం మా పార్టీ ప్రతినిధులకు అధికారిక పత్రాలు జారీ చేయాల్సి ఉన్నదని, కాబట్టి విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని కోరాను. ఆ లేఖలో సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనను మీ దృష్టికి తీసుకువచ్చాను. 65 సంవత్సరాల పైబడిన వ్యక్తులను వారు నివసిస్తున్న ప్రదేశంలోనే విచారించాలని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని నోటీసులను ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని స్పష్టం చేశాను.
3. నా లేఖకు ప్రతిస్పందనగా, గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు మీ సంతకంతో జారీ చేసినట్టుగా పేరొంటూ ‘హౌస్ నంబర్ 8-2-120/110/1/3, నందినగర్, రోడ్ నంబర్ 14, బంజారాహిల్స్, హైదరాబాద్’ చిరునామాలో ఉన్న ఇంటి ప్రహరీ గోడపై 30వ తేదీన రాత్రి 9 గంటలకు ఒక లేఖను అతికించినట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఆ లేఖ మీరు పంపినదే అయి ఉండి, మీ ఆదేశాల ప్రకారమే గోడకు అతికించి ఉంటే ఈ చర్యపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఇది భారత రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టు తీర్పులను మీరు గౌరవించడం లేదని స్పష్టం చేస్తున్నది.
4. సుప్రీంకోర్టు ‘సతేందర్‌కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ, ఇతరులు’ (2025 ఎస్సెస్సీ ఆన్లైన్ ఎస్సీ 1322) కేసులో ఇచ్చిన తీర్పులోని 11వ పేరాలో.. నిందితులకు, ఇతరులకు సీఆర్పీసీ 1973లోని సెక్షన్ 41-ఏ/ బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్-35, సీఆర్పీసీ 1973లోని సెక్షన్ 160/ బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 179 ప్రకారం నోటీసులు అందజేసే అంశంపై కింది ఆదేశాలను జారీచేసింది.
(ఏ) సీఆర్పీసీ 1973/బీఎన్ఎస్ఎస్ 2023లో పేరొన్న విధానంలో మాత్రమే సెక్షన్ 41-ఏ/ సెక్షన్ 35 కింద నోటీసులు అందజేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ పోలీసు యంత్రాంగానికి స్టాండింగ్ ఆర్డర్ జారీచేయాలి. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా నోటీసులు అందజేయడం చట్టబద్ధ ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు.
(బీ) సెక్షన్ 41-ఏ/సెక్షన్ 35కు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్లు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే జారీచేయాలి.
(సీ) సీఆర్పీసీ సెక్షన్ 160/బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179, సీఆర్పీసీ సెక్షన్ 175/బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 195 కింద నోటీసులు కూడా ఆయా చట్టాల్లో పేరొన్న విధానంలోనే జారీ చేయాలి.
5. పై తీర్పు ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద జారీచేసే నోటీసులు సీఆర్పీసీలో పేరొన్న విధానంలోనే అందజేయాలి. ఈ సమన్లు లేదా నోటీసులు కచ్చితంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చాప్టర్-6 ప్రకారం ఉండాలి. సీఆర్పీసీ సెక్షన్ 62(2) ప్రకారం ‘సమన్లను సాధ్యమైనంతవరకు సంబంధిత వ్యక్తికి వ్యక్తిగతంగా అందజేయాలి. లేదా సమన్ల యొక నకలును ఆ వ్యక్తికి అందేట్లు చూడాలి’ అని స్పష్టం చేసింది. అయినా మీరు ఉద్దేశపూర్వకంగా చట్ట ఆదేశాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించారు. 29న నేను రాసిన లేఖలో ‘భవిష్యత్తులో నోటీసులు ఎర్రవల్లి నివాసానికే పంపాలి’ అని పేర్కొన్నా, దానిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఇది కోర్టుధిక్కరణ కిందికి వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టంతో సమానం.
6. పై కారణాల దృష్ట్యా 30న మీరు పంపినట్టు చెప్తున్న లేఖ నాకు చట్ట ప్రకారం అందజేయలేదు. అంతేకాదు.. భారత రాజ్యాంగం నాకు ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ప్రకారం కల్పించిన గౌరవాన్ని మీరు కించపరిచారు. కాబట్టి పూర్తి న్యాయవిరుద్ధంగా అందజేసిన లేఖను నేను నిర్లక్ష్యం చేయగలను.
7. నేను 29వ తేదీన రాసిన లేఖలోనే సీఆర్పీసీ సెక్షన్ 160(1) నిబంధనలను మీ దృష్టికి తీసుకువచ్చాను. ఆ సెక్షన్ ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా దాని అనుబంధ పోలీస్స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి క్రైమ్ నంబర్ 243/2024కు సంబంధించి నాకు నోటీసు జారీచేసే అధికారం మీకు లేదు. కాబట్టి మీ అధికార పరిధిలో లేకున్నా మీరు జారీచేసిన నోటీసు అక్రమమైనది, సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ‘వీడీ మూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్’ (2025 ఎస్సెస్సీ ఆన్లైన్ ఏపీ) కేసులో ఇచ్చిన తీర్పులోని పేజీ నం.3099లో సెక్షన్ 160 కింద పోలీస్‌స్టేషన్ పరిధికి బయట నివసించే వ్యక్తులకు నోటీసు జారీచేసే అధికారంపై స్పష్టత ఇచ్చింది.
(ఏ) దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ‘ఏ వ్యక్తి అయినా’ తన ముందు హాజరయ్యేలా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసు జారీచేయగల అధికారం లేదు.
(బీ) ఆ అధికారి తన సొంత పోలీస్‌స్టేషన్ పరిధిలో లేదా దానికి ఆనుకొని ఉన్న స్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తులకు మాత్రమే జారీచేయగలరు.
(సీ) ఒకవేళ ఆ వ్యక్తి తన పోలీస్ స్టేషన్ లేదా ఆనుకొని ఉన్న స్టేషన్ పరిధిలో నివసిస్తున్నా.. బాలురు అయితే 15 ఏండ్ల కంటే తకువ వయస్సున్నవారిని, 60 ఏండ్లకంటే ఎకువ వయస్సున్న పురుషుడు లేదా మహిళలను, మానసికంగా లేదా శారీరకంగా దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారిని వయస్సుతో సంబంధం లేకుండా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179(1)లోని మొదటి నిబంధన ప్రకారం వారి నివాస ప్రదేశంలోనే విచారించాలి. పోలీస్ అధికారి వారికి సెక్షన్ 179(1) కింద నోటీసు జారీ చేయవచ్చు.
(డీ) పై పేరొన్న వ్యక్తులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179(1) యొక రెండో నిబంధన ప్రకారం, వారి స్వచ్ఛంద అంగీకారంతో మాత్రమే పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావొచ్చు.
(ఈ) దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారికి తన పోలీస్ స్టేషన్ పరిధిలో లేదా దానికి ఆనుకొని ఉన్న స్టేషన్ పరిధిలో నివసించని ఏ వ్యక్తికైనా సెక్షన్ 179(1) కింద నోటీసు జారీ చేసే అధికారం లేదు.
(ఎఫ్) అయితే దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఆ వ్యక్తిని, అతని నివాస ప్రదేశంలో సంప్రదించి, విచారించడానికి ఈ నిబంధన అడ్డంకి కాదు. ఇతర హైకోర్టులు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. ఉదాహరణకు ఢిల్లీ హైకోర్టు ‘జంషెద్ ఆదిల్‌ఖాన్ అండ్ అదర్స్ వర్సెస్ జమ్ముకశ్మీర్ ప్రభుత్వం, కుల్విందర్ సింగ్ కోహ్లీ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం’, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ‘క్రిషాన్ బాన్స్ బహదూర్ అండ్ అదర్స్ వర్సెస్ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం’ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రతులను జత చేస్తున్నాను.
8. మీరు 30న పంపిన లేఖలో, నేను నివసిస్తున్న ప్రదేశం అనగా ఎర్రవల్లిలో విచారణ జరపాలన్న నా అభ్యర్థనను తిరసరించినట్టు పేరొన్నారు. దీనికి కారణంగా.. అధికారిక రికార్డుల ప్రకారం, అనగా డిసెంబర్ 2023లో జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్, శాసనసభ రికార్డులు, పత్రాల ప్రకారం నా చిరునామా నందినగర్‌లో ఉన్నట్టు పేరొన్నారు. అయితే ఎన్నికల అఫిడవిట్, శాసనసభ రికార్డుల్లో ఉన్న చిరునామాకు సీఆర్పీసీ 1973 సెక్షన్ 160 నిబంధనల విషయంలో ఎలాంటి సంబంధం లేదని మీరు గమనించాలి.
సీఆర్పీసీ సెక్షన్ 160 ద్వారా ఇచ్చిన ఆదేశం ప్రకారం 65 ఏండ్ల కంటే ఎకువ వయస్సున్న ఎవరినీ పోలీస్‌స్టేషన్‌కు రావాలని అడగరాదు. నోటీసు జారీచేసిన సమయంలో అతను నివసిస్తున్న ప్రదేశంలోనే అతని స్టేట్మెంట్ను నమోదు చేయాలి. నోటీసు జారీచేసే సమయంలో ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రదేశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మరే ఇతర చిరునామాతో సంబంధం లేదు. ఎర్రవల్లి నా నివాస ప్రదేశం. నేను గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నాననేది నిర్వివాదాంశం. కాబట్టి, మీరు చట్ట ప్రకారం నా స్టేట్మెంట్ను నేను నివసిస్తున్న ప్రదేశంలోనే అనగా హౌస్ నంబర్ 3-96, ఎర్రవల్లి గ్రామం, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా చిరునమాలో మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది.
9. మీరు 29న ఇచ్చిన నోటీసులో నా స్టేట్మెంట్ను నమోదు చేయడానికి హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రదేశాన్ని సూచించమని నన్ను కోరారు. అంతేగానీ అధికారిక రికార్డుల ప్రకారం నా నివాసం నందినగర్గా ఉంది కాబట్టి, అకడే నా స్టేట్మెంట్ నమోదు చేయాల్సి ఉంటుందని నోటీసులో ఎకడా పేరొనలేదు. ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద జారీ చేసిన నోటీసులను హైదరాబాద్‌లోనే అందజేశారు. వాస్తవానికి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన నివాసం సిద్దిపేట. ఇది ఈ విషయంలో మీరు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, మీ వైఖరిని మార్చుకుంటున్నారని స్పష్టంగా సూచిస్తున్నది. కాబట్టి చట్టం ప్రకారం నా స్టేట్మెంట్ను నమోదు చేయడానికి నందినగర్ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు.
10. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా కింది విషయాలు స్పష్టంగా ఉన్నాయి.
(ఏ) చట్టపరంగా చూసినప్పుడు మీరు 30వ తేదీన నందినగర్ ఇంటి ప్రహరీకి అతికించింది నోటీసు కాదని, అది సతేందర్‌కుమార్ యాంటిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు, సీఆర్పీసీ సెక్షన్ 62కు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21కి విరుద్ధమని స్పష్టం అవుతున్నది.
(బీ) వివిధ హైకోర్టులు సీఆర్పీసీ సెక్షన్ 160పై ఇచ్చిన తీర్పుల ప్రకారం క్రైంనంబర్ 243/2024కు సంబంధించి నా స్టేట్మెంట్ నమోదుచేయడానికి నోటీసు జారీచేసే అధికారం మీకు లేదు.
(సీ) సీఆర్పీసీ సెక్షన్ 160(2)లోని నిబంధన ప్రకారం, నా నివాస ప్రదేశమైన ఎర్రవల్లిలో మాత్రమే నా స్టేట్మెంట్ను నమోదు చేయల్సిన చట్టబద్ధమైన బాధ్యత మీపై ఉన్నది.
11. చట్టపరంగా నాకు అనుకూలతలు ఉన్నా.. తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, ఈ దేశానికి చెందిన బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరించాలని భావిస్తున్నాను. మీరు నా స్టేట్మెంట్ను హైదరాబాద్‌లోనే నమోదు చేయాలని ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన మధ్యాహ్నం 3:00 గంటలకు నందినగర్‌లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటాను.
-ధన్యవాదములతో, (కే చంద్రశేఖర్ రావు)