KCR | బీఆర్ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా చేసే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు. ఎరువుల బస్తాకు యాప్ ఎందుకు అని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నాడు బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ నాయకులతో కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక, ఐటీ రంగం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో వెళ్లామని తెలిపారు. కానీ ఇవాళ జంట నగరాల్లో పట్టనగలు నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని. అడిగే దిక్కు లేదని విమర్శించారు. మానభంగాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం 20 శాతం క్రైమ్ రేటు పెరిగిందని.. వీటన్నింటిని రికార్డు చేసుకుంటూ చర్చిస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్కు ఓటు వేసే ఉద్దేశం ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు చెప్పి, మోసం చెప్పి, మాయమాటలు చెప్పారని కేసీఆర్ మండిపడ్డారు. అర్రాస్ పాటలు పాడినట్లుగా.. కేసీఆర్ రైతుబంధు 10 వేలు ఇస్తే.. మేం 15వేలు ఇస్తాం.. మహిళలకు 2500 ఇస్తాం.. కేసీఆర్ కల్యాణలక్ష్మికి లక్ష ఇస్తడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తాం.. పెన్షన్లు నవంబర్లో తీసుకోకండి.. డిసెంబర్లో తీసుకుంటే 4వేలు వస్తాయి. 2లక్షల రుణమాఫీ అని నరికిండ్రు.. ఇలా ప్రజలను టెంప్ట్ చేశారు. అన్ని వంద రోజుల్లోనే ఇస్తామని ఇంటింటికి కార్డులు పంచిండ్రు.. మొత్తానికి శఠగోపం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ధాన్యానికి బోనస్ ఇస్తామని చాంతాడు అంత లిస్ట్ పెట్టారు.. కానీ దేనికి దిక్కులేదు. ఇప్పుడు వడ్లు కొంటలేరని కేసీఆర్ తెలిపారు. దోపిడీకి గురై రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు గ్రామాల్లో ఆటో రిక్షావోనికి పైసలిస్తే పది బస్తాలు తెచ్చి పొలం దగ్గర పడేసి వెళ్తుండే.. కానీ ఇవాళ రైతులు రోజుల తరబడి, చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే.. బీఆర్ఎస్ వచ్చినంక చెప్పుల లైన్లు మాయమైనయి.. ఇప్పుడు మళ్ల కాంగ్రెస్ రాగానే చెప్పుల లైన్లు స్టార్ట్ అయినయ్.. అని అన్నారు. యూరియా సరఫరా కోసం ఇప్పుడు యాప్ తెచ్చిండ్రు.. అది కూడా పనిచేస్తలేదని ఎద్దేవా చేశారు. ఎరువు బస్తాకు యాప్ ఎందుకు అని ప్రశ్నించారు. ‘ ఆ యాప్లో ఏముంటందంటే.. నాకు సపోజ్ మూడెకరాలు ఉంది. ఎకరానికి రెండు బస్తాల చొప్పున మూడుసార్లు ఇస్తారంట.. అంటే నేను మూడుసార్లు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు.’ అని వ్యాఖ్యానించారు.
అర్రాస్ పాటలు పాడి రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండ్రు.. రెండు నెలల పెన్షన్లు ఎగ్గొట్టిండ్రు.. చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చారని కేసీఆర్ మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్ను ఒకేసారి వెయ్యికి పెంచానని గుర్తుచేశారు. రెండోసారి గెలిపిస్తే రెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చానని.. అధికారంలోకి వచ్చిన నెలలోనే రెండు వేలు ఇచ్చానని తెలిపారు. అలాగే కేసీఆర్ రెండు అంటే వీడు నాలుగు అంటున్నాడు కాబట్టి ఇస్తాడేమో అని అనుకున్నారు. టెంప్ట్ అయి ఓటు వేశారు.. ఇప్పుడు తలలు బాదుకుంటున్నారని.. భయంకరంగా తిడుతున్నరని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నిన్న హైదరాబాద్కు వస్తుండగా పది చోట్ల ప్రజలు ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారనడానికి ఇది సంకేతమని చెప్పారు.