KCR | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరుచేసినట్టు అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేశారంటూ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం అభ్యంతరం తెలుపకుండా మౌనంగా ఉన్నారని.. అదే పార్లమెంట్లో మన ఎంపీలు ఉండుంటే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు రణరంగం చేసేవాళ్లు అని పార్టీ అంతర్గత సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఈ 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? వాళ్లకు తెలంగాణ పౌరుషం లేదా? అని ప్రశ్నించారు. ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదని నిలదీశారు. అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా పార్లమెంట్లో క్షమాపణ చెప్పించేటోళ్లమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషంగా లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు.
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాల్లో నంబర్‌వన్, కూలగొట్టడంలో నంబర్‌వన్‌గా నిలబట్టే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతకానితనంతో ఉన్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుందని అన్నారు. చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తుందని అన్నారు.
ఇక ఈ అంతర్గత సమావేశంలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యవర్గానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రకటించారు.