చిన్నశంకరంపేట/చేగుంట, ఆగస్టు 18 : యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో మంగళవారం నిరసనలు చేపట్టారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు కేంద్రం వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం అవుతున్నా దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేయడంతో యూరియా అందించలేమని ఆగ్రోస్ ఫర్టిలైజర్ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో ఎంపీపీ కార్యాలయం వద్ద యూరియా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడా క్యూ పెరగడంతో యూరియా పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. ఆగ్రహించిన రైతులు చిన్నశంకరంపేటలోని మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి, ఏవో ప్రవీణ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ బుక్ చేసుకున్న రైతుల పేర్లు నమోదు చేసుకుని బుధవారం యూరియా అందించేందుకు చర్యలు చేపట్టడంతో ఆందోళన విరమించారు. కాగా చేగుంటలోని ఓ ఫర్టిలెజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. వచ్చిన యూరియా కంటే ఎక్కువ యాప్‌లో బుక్ కావడంతో కొందరు రైతులకు దొరక్క పోవడంతో వెనుదిరిగారు. నార్సింగిలో ఓ షాప్‌కు 500 యూరియా బస్తాలు వస్తే, వెయ్యికిపైగా యాప్‌లో బుక్అయ్యాయి. దీంతో సగం మందికే పంపిణీ చేశారు. యాప్‌లో బుక్ చేసుకున్న యూరియా బస్తాలు ఎక్కడికి పోయాయని రైతులు ఆందోళనకు దిగారు.