కోదాడ, అక్టోబర్ 1 : అధికారంలోకి వచ్చి మూడేండ్లవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా సిరిసిల్ల సభలో కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం కోదాడలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో ముఖ్యమంత్రి ప్రసంగంలో అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత లేదని చెప్పారు.
కేటీఆర్ అడిగిన వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకూ సమాధాన ఇవ్వకుండా ఫిరంగులు పేలుద్దాం, గద్దెలు, కూల్చుదామంటూ రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని హితవుపలికారు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టిన విషయాన్ని జనం మర్చిపోలేదన్నారు. ముఖ్యమంత్రి తీరును జనం అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.