ఖమ్మం, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపట్టారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ జీవో 51ని సవరించి పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, గ్రీన్ చానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు.
మక్తల్, ఆగస్టు 18 : కొడంగల్-నారాయణపేట పథకం భూనిర్వాసితులు ఏకం కావాలని భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో మంగళవారం కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ తన సొంత ఇలాకాకు భూత్పూర్ రిజర్వాయర్ నుంచి 7 టీసీఎంలు తరలించేందుకు చేపట్టిన కొడంగల్ లిఫ్ట్‌లో ఎందరో రైతుల భూములు పోతున్నాయని వాపోయారు. లగచర్లలో భూముల కోల్పోయిన నిర్వాసితులకు పరిహాంతోపాటు ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాన్ని ప్రభుత్వమే అందించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కోల్పోతున్న భూములకు సైతం పరిహారం, ఇంటి స్థలం, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.