KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( నమస్తేతెలంగాణ ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా సోమవారం పండుగలా జరుపుకున్నారు. గులాబీ శ్రేణులు, అభిమానులు వాడవాడలా కేక్‌లు కట్‌చేసి అభిమానాన్ని చాటుకున్నారు. పటాకలు కాల్చి, స్వీట్లు పంచి సంబురం జరుపుకున్నారు. పలుచోట్ల ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాల్లో వందలాదిమంది యువత రక్తదానం చేశారు. దవాఖానల్లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. వృక్షార్చనలో భాగంగా విరివిగా మొక్కలు నాటారు. చాలాచోట్ల పేదలకు అన్నదానం ఏర్పాటుచేశారు. కేసీఆర్ ఆయురోగ్యాలతో నిండు నూరేండ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అభిమాన నేత పేరిట అర్చనలు చేయించారు.
నందినగర్‌లోని వీరాంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై పూజలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఎంపీలు మాలోతు కవిత, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య 71 కిలోల భారీ కేక్‌ను కేటీఆర్ కట్ చేశారు. కేసీఆర్‌కు వైఎస్సాఆర్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలను, పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని ‘ఎక్స్’ వేదికగా ఆకాంక్షించారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 70 ఏండ్ల తెలంగాణ స్వరాష్ట్ర కలను నిజం చేసి, రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారని ఒక ప్రకటనలో కొనియాడారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలంగాణ చరిత్ర ఫొటో ఆల్బమ్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి కుంభమేళా నుంచి తెచ్చిన పవిత్ర జలాలను కేసీఆర్‌కు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీలుగా తెలంగాణభవన్‌కు తరలివచ్చారు. దారిపొడుగునా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్, లాంగ్‌లివ్ కేసీఆర్, హ్యాపీబర్త్‌డే కేసీఆర్’ అన్న నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ భవన్ ఆవరణలోని తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ విగ్రహాలకు కేటీఆర్, తలసాని తదితర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భవన్ ప్రాంగణంలో మహిళా నాయకులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సందీప్, మానుకోట ప్రసాద్, బందూక్ లక్ష్మణ్ కళాబృందం కేసీఆర్‌ను కీర్తిస్తూ పాడిన పాటలు కార్యకర్తలను కట్టిపడేశాయి. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి రూపొందించిన గీతంతోపాటు వివిధ కళారూపాలు, దీక్షాదీవస్ ఘట్టాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించారు. కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు మహేశ్‌రెడ్డి క్యాన్సర్ కేర్ సెంటర్ ‘స్పర్శ్’కు రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ మేరకు చెక్కును మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా సెంటర్ నిర్వాహకులకు అందజేయగా, మహేశ్‌రెడ్డిని కేటీఆర్ తదితరులు అభినందించారు. అనంతరం భోజనాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్యులు తలసాని సాయికిరణ్, గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, రాకేశ్‌కుమార్, ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
ములుగు, ఫిబ్రవరి17(నమస్తేతెలంగాణ): కేసీఆర్ అమలుచేసిన కల్యాణలక్ష్మి పథకం రూపకల్పనకు కారణమైన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్యతండాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఊరందరికీ బీఆర్ఎస్ నేతలు కొత్తబట్టలు పంపిణీ చేసిన ఘనంగా నిర్వహించారు. కల్యాణలక్ష్మీ పథకం రూపకల్పనకు ఆద్యులైన కీమానాయక్ కుటుంబానికి, గ్రామంలోని మహిళలందరికీ చీరలను అందజేశారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ఊరూవాడల్లో సంబురాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహా ఆయన ఆధ్వర్యంలో 708 మంది రక్తదానం చేశారు. హుజూరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుదర్శన హోమం నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రూ.30 వేల కోట్లతో యాదాద్రి పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ప్లాంట్వద్దే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ కార్యకర్తలకు హెల్మెట్లను అందజేసి, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కేసీఆర్‌పై అభిమానంతో మెదక్ జిల్లా నిజాంపేట సమీపంలోని చల్మెడ గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు బాలగౌడ్ కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు చాక్లెట్లను పంచిపెట్టి అభిమానం చాటుకున్నారు.
కేసీఆర్ అంటే నాలెడ్జ్, కరేజ్, రిజల్ట్ అని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిపెట్టిన కారణజన్ముడని కొనియాడారు. ఆయన జన్మదినం తెలంగాణ జాతికే పర్వదినమని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మధుసూదనాచారి మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ అడుగడుగునా దగా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎదిరించేందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆయన గొప్పతనం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే తెలుసన్నారు. పిల్లకాకి అయిన రేవంత్‌కు కేసీఆర్ ఉండేలు దెబ్బ గురించి తెలియదని హెచ్చరించారు. కేసీఆర్ తన పాలనా చాతుర్యంతో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు. కేసీఆర్ కండ్లు తెరిస్తే రేవంత్‌రెడ్డి పని ఖతమవుతుందని హెచ్చరించారు. ఆయన స్థాయి మరిచి కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే తెలంగాణ సమాజం ఊరుకోబోదని తెలిపారు. తగిన సమయంలో ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. సైకోరియన్ హోం అనాథ పిల్లల ఆశ్రమంలో సంతోష్‌కుమార్ కేక్ కట్ చేసి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆశ్రమానికి రూ.2 లక్షల విరాళం అందజేస్తానని ప్రకటించారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ తన్నీరు మహేశ్ సూచన మేరకు సోమవారం విదేశాల్లో ఎన్ఆర్ఐలు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. యూకే, యూఎస్ఏ, కువైట్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసి, మొక్కలు నాటారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. లండన్, యూఎస్ఏలో జరిగిన వేడుకల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై యూకే కార్యదర్శి ఉపాధ్యక్షుడు హరిగౌడ్,
ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదల, రవి, సతీశ్‌రెడ్డి, సత్యమూర్తి, దొంతుల వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, గణేశ్, మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శులు మల్లారెడ్డి, సతీశ్‌రెడ్డి, రవిప్రదీప్, సాయిబాబా కోట్ల, రమేశ్, సత్యపాల్‌రెడ్డి, రామకృష్ణ, సాయికిరణ్ రావు, పవన్‌కుమార్‌గౌడ్, నర్సింగ్‌రావు, పవిత్రారెడ్డి, సుప్రజ, క్రాంతి, పావని, స్నేహ, సుమన్‌రావు, వంశీ, తులసి పాల్గొన్నారు. కువైట్, నైజీరియా, బహ్రెయిన్లోనూ వేడుకలు జరుపుకొన్నారు.
అమెరికాలోని వివిధ నగరాల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు మహేశ్ తన్నీరు ఆదేశాల తో అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, బోస్ట న్, కనెక్టికట్, సిన్సినాటి, చికాగో, డల్లాస్, డెలవేర్, హోస్టన్, సాన్ ఆంటోనియా, కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, సాక్రమెంటో, సీటెల్, న్యూయార్క్, న్యూజెర్సీ, మినియాపోలిస్, కన్సాస్ తదితర నగరాల్లో వేడుకలు నిర్వహించారు.
ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను కలిసి బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్న ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు. చిత్రంలో మాజీ మంత్రి వేముల, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సోమవారం ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శాలువా కప్పి బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్న రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్
కేసీఆర్‌కు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ
కేసీఆర్‌కు బొకే అందజేసి బర్త్‌డే గ్రీటింగ్స్ చెబుతున్న మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
కేసీఆర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్నఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, డాక్టర్ మాధవి దంపతులు సిక్కింలో మొక్కలు నాటారు. సోమవారం గ్యాంగ్‌టక్ శివారులోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరింత సేవచేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని ఈ సందర్భంగా వినోద్‌కుమార్ ఆకాంక్షించారు.
జనగామ జిల్లా దేవరుప్పులలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు హెల్మెట్లు అందజేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
శుభాకాంక్షలు తెలిపి కేసీఆర్ చేతిని ముద్దాడుతున్న మాజీ మంత్రి మహమూద్ అలీ
ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ ఆవరణలో కేసీఆర్ బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. చిత్రంలో నాయకులు కృష్ణ, నాగరాజు
ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను కలిసి బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
కేసీఆర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి
ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న
ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండబాల