హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లా నుంచే కాకుండా చుట్టపక్కల జిల్లాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలిరావడంతో ఖమ్మం నిండుకుండలా మారింది. బహిరంగ సభలో ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం అభివృద్ధికి పునాది పడగా అదే స్ఫూర్తితో రవాణా మంత్రి అజయ్ ముందుకెళ్తున్నారని కొనియాడారు. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. మంత్రి అజయ్ వినతి మేరకు మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ఈ బహిరంగ సభలో ఢిల్లీ,పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బీఆర్ఎస్ జాతీయ నాయకులు వినీత్ నారాయణ్, గుర్నాం సింగ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, మాలోత్ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వనం వెంకటేశ్వరరావు, రాములు నాయక్, హరిప్రియా నాయక్, బాల సుమన్, గాదరి కిశోర్, జీవన్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌బాబు, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.