నకిరేకల్, నవంబర్ 25: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఈ దవాఖాన అందుబాటులోకి వస్తే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
నకిరేకల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 80శాతం వరకు దవాఖాన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అయినా పనులు పూర్తిచేయకపోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
నకిరేకల్‌లో వంద పడకల దవాఖానను తీసుకురాబోతున్నామని తాను చెప్పినప్పుడు మొదట నవ్వుకున్నారని, వస్తుందా? అని ఎగతాళి చేశారని, ఇక్కడ దవాఖాన కడితే మునిగిపోతుందని, కూలిపోతుందని మాట్లాడిన వాళ్లు ఉన్నారని, వారి మాటలు లెక్కచేయకుండా పనులు మొదలు పెట్టినట్టు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం 22 జనవరి 2022న రూ.32 కోట్లతో వంద పడకల దవాఖానను మంజూరు చేశామని గుర్తుచేశారు.
నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భవన నిర్మాణం కోసం రూ.32 కోట్లు, 69 మంది సిబ్బంది, వారి జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం ఏటా రూ.6.35 కోట్లు మంజూరు చేశారని, ప్రజల ఆరోగ్యం కోసం శాశ్వత ఖర్చు ప్రభుత్వమే భరించేలా కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఘనంగా శంకుస్థాపన చేయించినట్టు చెప్పారు. అది నకిరేకల్ అభివృద్ధిలో పెద్ద మైలురాయిగా నిలిచిందని కొనియాడారు.