హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే.. మన పొలాల్లో గోదావరి నీళ్లు పారాలంటే మళ్లీ కేసీఆరే రావాలి..మనమందరం ఆ దిశగా పనిచేయాలి’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆకలి, ఉద్యోగాల ముచ్చట మరిచి మతం ముచ్చటే చెప్తూ ప్రజల మధ్య కొట్లాటలు పెడ్తుండటాన్ని సహించలేక తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేనా పరిషత్ నాయకులు బీఆర్ఎస్వీలో చేరడం శుభపరిణామనని వ్యాఖ్యానించారు. తన విజ్ఞప్తిని మన్నించిన సందీప్ నేతృత్వంలోని విద్యార్థి నేతలను అభినందించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్వీలో టీఆర్‌వీఎస్‌పీ విలీన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నీళ్లు, నిధులు ఆంధ్రాకు చెందిన గురువులకు అప్పజెప్తున్న తరుణంలో విద్యార్థి నేతలు బీఆర్ఎస్వీలో చేరి కాం గ్రెస్ సర్కారు కుట్రలను అడ్డుకొనేందుకు కలిసిరావడం, డైనమిక్ లీడర్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి కేసీఆర్ పాలనలోనే తమ కలలు సాకారమవుతాయని భావించి బీఆర్ఎస్వీలోకి రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో సూర్యాపేటకు ఎంత పేరున్నదో తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రలోనూ సూర్యాపేట పేరును అలా శాశ్వతంగా లిఖించుకుందామని ఉద్బోధించారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సుమన్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు ఆంజనేయులుగౌడ్, స్వామి, విద్యాసాగర్, రాకేశ్‌రెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, బానోతు రవి, వెంకట నారాయణ, తుంగ బాలు, పల్లా ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి నేతలకు సాదర స్వాగతం తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్వీలో టీఆర్‌వీఎస్‌పీ విలీన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌వీఎస్‌పీ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘జై తెలంగాణ’.. ‘జైజై తెలంగాణ’..‘జయహో కేసీఆర్’, ‘జయహో కేటీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బీఆర్ఎస్వీలో చేరిన నాయకులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. చేరినవారిలో టీఆర్‌వీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సందీప్, చామకూర మహేందర్ (నల్లగొండ), లావూరి వాసు (సూర్యాపేట) బాది అంజి ( కోదాడ), ఉదయ్‌కుమార్ (హుజూర్నగర్),ఇస్లావత్ సోమూ నాయక్ (తుంగతుర్తి), సాయి దీపక్, రమావత్ సుమన్, పులి నితిన్, ప్రణీత్‌కుమార్, అభినవ్, నందనబోయిన సునీత, దాగని మల్లేశ్, వడ్డే నరేశ్, చెడపంగు సిద్ధార్థ్, మధు ఉన్నారు.