KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని.. ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ వాళ్లు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెట్టారన్నారు. ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించారు. గురుకులాల్లో చదువు అగమ్యగోచరమైందని.. పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటు వేశారన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని.. రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మబ్బులు ఇప్పుడే తొలగిపోయి నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మంచేదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుందన్నారు. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నాం చేస్తున్నారన్న కేసీఆర్.. ఫామ్ హౌస్లో పంటలు తప్ప ఏముంటాయని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల టెండర్లు ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపై అంతా అసంతృప్తే ఉందన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచిందన్నారు. పాలనా వైఫల్యాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.