ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లుగా తీర్చిదిద్దిన పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు సైతం మంగళం పాడుతున్నది. తెలంగాణ బిడ్డలకు కొండంత అండగా నిలిచిన అనేక ప్రజాప్రయోజన పథకాలపై ప్రభుత్వం నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలన్న ప్రతీకారేచ్ఛతో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు.. పథకాల లబ్ధిదారులకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
KCR | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే అవసరాలు ఉంటాయో గుర్తించి అమలు చేసిన ఘనత, సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే. అయితే, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొన్ని పథకాలను నిర్దాక్షిణ్యంగా అటకెక్కించగా, మరికొన్నింటిని నిధు లు విడుదల చేయకుండా పక్కనపెట్టింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆయా పథకాలకు బ్రేకులు వేసింది. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
బీసీల్లోని కుల వృత్తులవారు కాలానికి తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ పెంచుకొని, అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. నాయీ బ్రాహ్మణులు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు.. ఇలా కులవృత్తులపై ఆధారపడి జీవించేవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల దరఖాస్తులొచ్చాయి. అధికారులు వీటిని పరిశీలించి 4.16 లక్షల మంది అర్హులని తేల్చారు. ఇందులో సుమారు 40 వేల మందికి చెక్కులు అందజేశారు. మిగతా 3.76 లక్షల మందికి దశలవారీగా ఇవ్వాల్సి ఉన్నది. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కనపెట్టింది. బీసీబంధు కింద చెక్కులు తీసుకున్నవారు ఆ డబ్బుతో ఏం చేశారో లెక్క చెప్పాలంటూ విజిలెన్స్ విచారణ మొదలు పెట్టినట్టు ఆరోపణలున్నాయి.
పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కలలను సాకారం చేసుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేసింది. బీసీల కోసం పూలే పేరుతో, ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించింది. పేద బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఈ పథకాన్ని అమలుచేసింది. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి, వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకోవాలని, తద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పటివరకు దాదాపు మూడు వేల మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేసిందని ఆరోపణలొస్తున్నాయి. కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేయకపోగా, పాత వాటికి నిధుల కేటాయింపు నిలిచిపోయినట్టు చెప్తున్నారు. దీంతో చదువు మధ్య లో ఆపేసే పరిస్థితి తలెత్తుతున్నది.
కనీవినీ ఎరుగని భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర నీటిపారుదల రంగ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌పై చేస్తున్న రాజకీయం, తద్వారా అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలు అందరికీ తెలిసిందే. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసింది. సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేసింది. సమీక్షల పేరుతో ఇతర ప్రాజెక్టుల పనులు సైతం పురోగతి లేకుండా నిలిచిపోయాయి.
గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులు చేసి, సమగ్ర కార్యాచరణతో పనులు చేపట్టింది. ఫలితంగా పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సమకూరాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్నీ పక్కనపెట్టింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు అనుమతులను సులభతరం చేస్తూ గత ప్రభుత్వం టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సింగిల్ విండో అనుమతుల విధానం దేశ పారిశ్రామిక రంగంలోనే వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు అందుకున్నది. సులభంగా అనుమతులు వస్తుండటంతో వేలాది కంపెనీలు తెలంగాణ బాట పట్టాయి. అనేక రాష్ర్టాలు టీఎస్ఐపాస్ను అధ్యయనం చేసి అమలు చేశాయి. అయితే గత నాలుగు నెలలుగా టీఎస్ఐపాస్ నుంచి అనుమతులు ఆపేసినట్టు పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి.
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాలను బాగు చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలుచేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించి, వారు తమకు నచ్చిన, నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు చేయూత అందించింది. ఈ క్రమంలో 40 వేల కుటుంబాలకు దళితబంధును మంజూరు చేసింది. మరో 1.30 లక్షల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళితబంధును రూ.12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రకటించలేదు. పైగా గతంలో ప్రొసీడింగ్స్ ఇచ్చిన యూనిట్లకు నిధులను కేటాయించడం లేదు.
యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడంతోపాటు మాంసం ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు చొప్పున అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి.. మొదటి, రెండు విడతల్లో కలిపి 4.2 లక్షల యూనిట్లు పంపిణీ చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు కోటిన్నర గొర్రెపిల్లల ఉత్పత్తి జరిగిందని అంచనా. రెండో విడత కింద ఇంకా గొర్రెల పంపిణీ జరగాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. డబ్బులు కట్టిన యాదవ కుటుంబాలు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చేందుకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో, దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి కేసీఆర్ సర్కారు రూపకల్పన చేసింది. ఇందుకోసం రూ.672 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది.
గర్భిణుల్లో పోషకాహార లోపం ఉండొద్దనే ఆలోచనతో 2022 డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని ప్రారంభించింది. మొదట తొమ్మిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పోషకాహార లోపం తగ్గడం, శిశు మరణాలు తగ్గడం వంటి మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. నిరుడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మిగతా 24 జిల్లాలకు విస్తరించింది. సుమారు 6.84 లక్షల మంది గర్భిణులకు కిట్లు అందించాలని సంకల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కనపెట్టేసింది. కిట్ల కొనుగోలును ఆపేసింది. కనీసం తమకు పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.