ఎంత మంచిగుండె తెలంగాణ.. బొందలపడేసిండ్రు.. నా కండ్ల ముందే ఇట్లయితదనుకోలే.. దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి పడేసిండ్రు. నా కండ్ల ముందు గిట్ల జరుగుతది.. గింత మాయిలమే అయితది.. ఇంత మోసం చేస్తరని అనుకోలే. ఇయ్యాల చాలా బాధ కలుగుతున్నది. చాలా దుఃఖం కలుగుతున్నది. ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనకకు పోతున్నది. దీనికి కారణం ఎవరు..? ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కాదా? వాళ్లను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలె!
-కేసీఆర్
పద్మాక్షి గుట్టల్లో ప్రతిధ్వనించిన
పర్జన్యశంఖారావమా!
వేయిస్తంభాలలో మార్మోగిన
ఢమరుక నాద విన్యాసమా!
రుద్రేశ్వరుడి శివనర్తనమా..
భద్రకాళి రౌద్రతాండవమా!
కాకతీయుల కోటలో
ధరాకంపిత జన జయధ్వానమా!
అది కేసీఆర్ స్వరమా
తెలంగాణ యుద్ధారావమా!
ఇపుడేం ఉద్యమాలు లేవు. ఎన్నికలు కూడా లేవు… బీఆర్ఎస్ అధికారంలోకూడా లేదు.. అయినా ఉరిమే ఉత్సా హం. ఏదో జాతరకు తరలివచ్చినట్టు..
నేల ఈనిందా? ఆకాశం విరిగిపడిందా?
జనసముద్రం ఉప్పొంగిందా?
తెలంగాణ తనే తరలివచ్చిందా?
ఏమా జనం? ఓరుగల్లు నిండా
ఎక్కడిదీ ప్రజానీకం
ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగుతూ పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
ఓరుగల్లు జనసముద్రపు హోరుగల్లు అయ్యింది. దారులన్నీ ప్రజాప్రవాహాలయ్యాయి. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ. ప్రకంప తీవ్రతను కొలిచేందుకు ఏ రిక్టర్ స్కేళ్లూ పనికిరాలే. కనుచూపు మేర జనసముద్రమే కనిపించింది. కేసీఆర్ కోసం కోట్లాది తెలంగాణ గుండెలు ఎలా ఎదురుచూస్తాయో మరోసారి స్పష్టమైంది. సభావేదిక ముందు కూర్చున్న లక్షల మందే కాదు.. టీవీలముందు ఆసీనులై చూసిన కోట్ల కన్నులు కూడా ‘జై కేసీఆర్’ అని నినదించాయి అణచివేతల మధ్య, ఆశల తుంచివేతల మధ్య.. ఈ నేల కేసీఆర్ వైపే చూసింది. నిర్బంధ కాలాల్లోనూ కేసీఆర్ అనే నమ్మిక కోసమే తపించింది. అందుకే రజతోత్సవ ప్రాంగణం వద్ద కేసీఆర్ హెలికాప్టర్ దిగుతుంటే.. ప్రజలు పరుగులుతీశారు. చేతులూపుతూ నినాదాలు చేశారు.
కేసీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ గంతులేశారు. తెలంగాణ దుస్థితిని చెప్పి ఆయన గొంతు గద్గదమైతే.. వారంతా వ్యాకులపడ్డారు. ఆయన మళ్లా పోరాడుదామని పిలుపునిస్తే, జంగ్ సైరన్ మోగిస్తే.. సభలో ఉన్న పది లక్షలకు పైగా జనం పిడికిలెత్తి సై అన్నారు. ఇది కదా ఉద్యమ పార్టీ 25 ఏండ్ల భావోద్వేగపు ప్రయాణానికి సిల్సిలా! ఇది కదా మరో మిలియన్ మార్చ్!
ఎర్రటి ఎండలు, సర్కారు అడ్డంకులు లెక్క చేయకుండా అంచనాలను మించి ఎక్కడెక్కడినుంచో తరలివచ్చిన ప్రజలు. ఇపుడేం ఉద్యమాలు లేవు. ఎన్నికలు కూడా లేవు… బీఆర్ఎస్ అధికారంలోకూడా లేదు.. అయినా ఉరిమే ఉత్సాహం. ఏదో జాతరకు తరలివచ్చినట్టు.. సభకు వెళ్లడం తమ బాధ్యత అన్నట్టు వచ్చిన ప్రజలు. ఎపుడో ఉద్యమకాలంలో చూసిన ఊపు. అప్పటి గులాబీ సభల్లో కనిపించిన ఉత్సాహం ఎల్కతుర్తిలో మళ్లీ ఆవిష్కృతమైంది. బీఆర్ఎస్ పనై పోయింది అని కాకిగోల చేసిన గొంతులు ఇప్పుడు మాటలు దొరక్క నీళ్లు నమలాల్సిన పరిస్థితి. పేరుకు పార్టీ రజతోత్సవ సభ కావచ్చు కానీ.. వచ్చిన ప్రజలకు ఇది తెలంగాణ సభ. తెలంగాణ కోసం జరుగుతున్న సభ.
ఇది గులాబీ పార్టీకి పెద్ద మలుపు!
రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు!!
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకముందే కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్!
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నది. అది ధర్మం కాదు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నరు. మేము ప్రభుత్వం దగ్గరికొచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నమని అంటున్నరు. నేను కేంద్రాన్ని కోరుతున్నా. బలం ఉందికదా అని చంపుకుంట పోవడు కాదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయండి. నక్సలైట్లను పిలిచి చర్చలు జరపండి. వాళ్లు ఏమి మాట్లాడుతరో చూడండి. అదిగూడ నల్లనా తెల్లనా దేశం ముందటికి రానీయండి. అట్లకాదు, మొత్తం నరికి పారేస్తం, కోసి పారేస్తం అంటే ఎలా? మిలట్రీ మీదగ్గర ఉన్నది కాబట్టి కొడతరు. కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ధర్మం కాదు.
-కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ): “60ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు ఎంత గోస.. ఎంత దుఃఖం. గోదావరి, కృష్ణ నీళ్లు తట్టకుండా తరలిపోతే, తల్లి చనుబాలకు నోచని బిడ్డల్లాగా తెలంగాణ ప్రజలు రోదించారు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు కుట్టి, తేళ్లు కుట్టి అనాథల్లా రైతులు చనిపోయారు. అయినా ఆ నాడు ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నరు తప్ప ఏనాడూ కొట్లాడలేదు. ఏనాడూ తెలంగాణ సోయిని ప్రదర్శించలేదు. అనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ప్రజాప్రతినిధులు, లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, సైకిళ్ల మీద, ఎడ్లబండ్ల మీద, పాదయాత్రగా అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారందరికీ తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ నాడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశ్రయమిస్తే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపుతిప్పిన మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు. తెలంగాణ సాధన కోసం, పదవీ త్యాగాలతోనే పుట్టింది గులాబీ జెండా. అది ఫలించి సొంతరాష్ట్రం కల కూడా నెరవేరింది.
-కేసీఆర్
రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులను వివరించారు. “శ్రీరామ చంద్రుడు రావణ సంహారం చేసి, లంకను గెలిచి అయోధ్యకు తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా అద్భుతంగా ఉంది. ఆయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటరు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గదాపి గరీయసి’ అని కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం ఏమీ ఉండదు అని చెప్పి ఆయోధ్యకే తరలిపోదామంటూ తిరిగి వచ్చారు. అదే స్ఫూర్తితో చాలా గందరగోళ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, ఆత్మార్పణకు ఆలవాలమైన, వలసలకు నిలయమైన, వలసవాదుల విషకౌగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తేవాలని, స్వరాష్ర్టాన్ని సాధించాలని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరాను.
తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అలా 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా గులాబీ జెండా. చాలా మంది జెండాను అవమానించారు. ఎన్నో మాటలన్నరు. వెటకారం చేసిండ్రు. అవహేళన చేసిండ్రు. మఖలో పుట్టింది పుబ్బలో పోతుందన్నరు. కానీ గులాబీ జెండా అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతో, వందలాది బలిదానాలు చేయడంతో, అనేక ఉద్యమాలతో యావత్ తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైన ఉద్యమమై ఎగసి పడింది. తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చుని బరిగీసి నిలబడ్డది. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. ప్రజలు దీవిస్తే పదేండ్ల పాటు అద్భుతమైన తెలంగాణను తయారు చేసి, అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను నిర్మాణం చేసుకున్నం. ఆ విధంగా 25 ఏండ్ల చరిత్రను ఈ వరంగల్ గడ్డ మీద జరుపుకొంటున్నం.
చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా బ్రహ్మండమైన ప్రయత్నాలు చేస్తున్నరు. ఒక్కటే మాట చెబుతున్న. వరంగల్ గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణిరుద్రమ ఏలిన వీరగడ్డ. సమ్మక్క సారక్కల పోరుగడ్డ. బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించిన జీవగడ్డ. వరంగల్ నేలకు నేను వందనం చేస్తున్న. అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పించి చెప్తున్న. 1969లో మొదలైన తెలంగాణ నినాదానికి జీవం పోసింది గులాబీ జెండా. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసం నుంచి వికాస పథం లో నడిపించింది తెలంగాణ. ఈ నాటికి 25 ఏండ్లు నిండుతున్నాయి.
అనాడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశ్రయమిస్తే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపుతిప్పిన మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు. తెలంగాణ సాధన కోసం, పదవీ త్యాగాలతోనే పుట్టింది గులాబీ జెండా. అది ఫలించి సొంతరాష్ట్రం కల కూడా నెరవేరింది. అనాడు అలముకున్న చీకటిని పారదోలడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి పుట్టింది. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన. ఆ తరువాత స్థానిక ఎన్నికల్లో, సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలు ఊదితే ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు.
రైతు కష్టమేందో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును. అందుకు రైతాంగాన్ని కండ్లలో పెట్టుకుని చూసుకున్న. దేశంలో షేర్షాసూరి అనే రాజు ఉండే. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చారు. చరిత్ర పొడుగుతా చూస్తే స్వతంత్ర భారతం వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేశాయి. నీటి తీరువాలు వసూలు చేశాయి. రైతులను ఎవరూ ఆదుకోలె. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా, ఎవరూ అడగకున్నా, ఎన్నికల్లో చెప్పకున్నా నాకు నేనుగా ఆలోచించి రైతుబంధు పథకాన్ని తెచ్చి అమలు చేసినం. రైతాంగానికి కరెంటు ఇచ్చినం. తెలంగాణ వస్తే కారు చీకట్లయితయ్, కరెంటే రాదు, పంటలే పండియ్యరాదు అని వలసవాద ముఖ్యమంత్రులు చెప్తే వాళ్ల నోళ్లు మూయించేలా, ట్రాన్స్పార్మర్, మోటార్ కాలనటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లయ్ చేసినం.
రైతులు ఇంట్ల కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినయ్. రైతులు చనిపోతే పట్టించుకన్న నాథుడు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తరువాత రైతు బీమా తెచ్చి 8 రోజుల్లోనే రైతుబీమా అందేలా చర్యలు తీసుకున్నం. చినుకులు పడుతుంటే.. చకాచకా వచ్చి బ్యాంకుల్లో డబ్బులు పడి సెల్ఫోన్లు మోగుతుండె, ఆ విధంగా కడుపుల చల్ల కదలకుండా రైతాంగానికి రైతుబంధు అమలు చేసుకున్నం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు అన్నరు. జై జవాన్.. జై కిసాన్ అన్నరు తప్ప ఎవరూ పట్టించుకోలె. వందల కోట్లు నష్టమొచ్చినా ధాన్యం కొన్నం. వడ్లు కొంటే 3,4 నెలల్లోనే ఖాతాల్లో డబ్బులు వేసిన. అవన్నీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఎన్నోరకాల బాధలు, 7,500 కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్ల తీసుకున్నమో అందరికీ తెలుసు” అని కేసీఆర్ వివరించారు.
చంద్రబాబునాయుడు ఆ నాడు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ అనవద్దని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ప్రణయ్‌భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యేగా, శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనదిగా పరిగణించి నిషేధించే ప్రయత్నం చేశాడు. అనాడైనా.. ఏనాడైనా, ఈ నాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే.
-కేసీఆర్
చరిత్ర పొడుగుతా చూస్తే స్వతంత్ర భారతం వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేశాయి. నీటి తీరువాలు వసూలు చేశాయి. రైతులను ఎవరూ ఆదుకోలె. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా, ఎవరూ అడగకున్నా, ఎన్నికల్లో చెప్పకున్నా నాకు నేనుగా ఆలోచించి రైతుబంధు పథకాన్ని తెచ్చి అమలు చేసినం.
-కేసీఆర్
తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవాళ్లు బీఆర్ఎస్ బిడ్డలు. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవాళ్లు అనాటి కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబునాయుడు అనాడు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ అనవద్దని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ప్రణయ్‌భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యేగా, శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనదిగా పరిగణించి నిషేధించే ప్రయత్నం చేశాడు. అనాడైనా.. ఏనాడైనా, ఈ నాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే. అందరికీ ఆ విషయం తెలుసు.
తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరిట ఉన్ననాడు ప్రజలు వద్దన్నా జవహర్లాల్ నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపారు. 1969లో ఉద్యమంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది. మళ్లీ 2001 నుంచి మనం ఉద్యమిస్తే మన బలాన్ని, ఊపును చూసి పొత్తు పెట్టుకుని, తెలంగాణ ఇస్తమని నమ్మబలికి ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. 14 ఏండ్లు ఏడిపించారు. వాళ్ల మోసాన్ని తెల్లగొట్టడానికి నేను, జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని ఒప్పించాం.
కాంగ్రెస్ మెడలను వంచినాం. అప్పటికీ ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి, మంత్రులు రాజీనామాలు చేసి మళ్లి ఉద్యమ జెండాను పట్టుకున్నాం. ఆ తరువాత కూడా రాకపోతే ప్రాణాలకు తెగించి, ఆమరణ దీక్షకు పూనుకున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్, పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ గొంతుపట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. మళ్లీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఆ తరువాత సకల జనుల సమ్మె, సాగరహారాలు, వంటావార్పు అనేక రూపాల్లో ఉద్యమించి పోరాటం చేశాం. మళ్లా మూడేండ్ల తరువాత రాజకీయ అవసరమేర్పడి వాళ్లకు ఇష్టం లేకపోయినా తెలంగాణ ఇచ్చారు.
ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అనుభవించడానికి తీసుకోలె. బాధ్యతగా తీసుకున్నం. బ్రహ్మాండంగా పనిచేశాం. రాష్ర్టాన్ని మన చేతిల పెడితే ఎక్కడికో తీసుకుపోయాం. అనేక రంగాల్లో అనేక అవార్డులు. అద్భుతమైన పనులు చేసి చూపినం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం. ఎగతాళి చేయబడిన ప్రాంతం. పనికిమాలిన ప్రాంతం. కానీ తలసరి ఆదాయాన్ని 97వేల నుంచి 3.5 లక్షలకు పెంచుకున్నం. జీఎస్డీపీలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపినం. పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ఆగమేఘాల మీద పనిచేసి పూర్తిచేసినం. ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకున్నం.
బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించుకునే స్థాయికి తెలంగాణను తీసుకుపోయినం. వరంగల్ గడ్డ కోసం పెండింగ్‌లో ఉన్న దేవాదులను పూర్తి చేసి నీళ్లు తెచ్చుకున్నం. మూడేండ్లలో కాళేశ్వరం కట్టుకున్నం. వాగులపై చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నం. మిషన్‌కాకతీయ పేరుమీద చెరువుల పూడికలు తీసుకున్నం. అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నం. పడావు భూములను పంట పొలాలుగా మార్చుకున్నం. అనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాసులు.. కల్లాల నిండా ధాన్య రాసులు. పంజాబ్‌ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా అందరికీ తెలుసు.
తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరిట ఉన్ననాడు ప్రజలు వద్దన్నా జవహర్లాల్ నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపారు. 1969లో ఉద్యమంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది. మళ్లీ 2001 నుంచి మనం ఉద్యమిస్తే మన బలాన్ని, ఊపును చూసి పొత్తు పెట్టుకుని, తెలంగాణ ఇస్తమని నమ్మబలికి ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. 14 ఏండ్లు ఏడిపించారు.
-కేసీఆర్
ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి ఎల్కతుర్తి సభకు బయలుదేరుతున్న పార్టీ అధినేత కేసీఆర్‌కు దట్టీ కడుతున్న స్నేహితుడు జహంగీర్. చిత్రంలో సంతోష్‌కుమార్