కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయి.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లతో వచ్చే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐని మోదీ జేబు సంస్థగా రాహుల్‌గాంధీ విమర్శిస్తే, రేవంత్ దానిని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనమని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్‌రావు తన అనుచరులతో బుధవారం ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ పదేండ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నాని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ప్రతి ఒకరూ అంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఆ తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందని మండిపడ్డారు. ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయతీగా మోసం చేశాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సముద్రమట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించే అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని కేటీఆర్ కీర్తించారు. 2014లో వ్యవసాయ దిగుబడుల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతున్నదని తెలిపారు.
రేవంత్‌రెడ్డి తన మాటలతో, చేతలతో ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణను క్యాన్సర్, ఎయిడ్స్ రోగితో పోల్చడం, ఢిల్లీకి పోతే తనను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని అనడం, పేగులు మెడలో వేసుకుంటా.. వంటి మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు, రేవంత్‌రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు.
దమ్మున్న నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవని కేటీఆర్ స్పష్టంచేశారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం సున్నా అయినా రైతులకు రైతుబంధు, వృద్ధులకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలను కేసీఆర్ ఆపలేదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్‌కు పనిచేయడం చేతకాక సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ. 2.8 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పినా సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్టు అంటూ సొల్లు పురాణం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించడం నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్ని విధాలా అండగా నిలిచిందని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. అయినా, సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.
పార్టీకి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మధ్య సమన్వయం లోపించిందా? యూనియన్ అంతర్గత రాజకీయాలు పార్టీపై ప్రభావం చూపించాయా? అనే కోణంలో ఆనాడు చర్చించామని చెప్పారు. పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.