లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే, ఢిల్లీలో సత్తా చాటి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకుంటూ, అవసరమైన వాటిని సాధించుకొస్తా.
-పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ (మే 7, 2024, నిజామాబాద్.)
KCR | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరం అని పదే పదే తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎందుకంటారన్నదానికి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎదురైన దుస్థితి అద్దం పడుతున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమి జరుగబోతున్నదో కేసీఆర్ ముందే ఉహించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు ఎందుకు గెలువాలో విడమరిచి చెప్పారు. అయినా వినిపించుకోకపోతే దాని ఫలితాలు ఎలా ఉంటాయన్నదానికి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల కనబరిచిన వివక్ష, జరిగిన అన్యాయమే నిదర్శనం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎమన్నారో ఒకసారి గుర్తు చేసుకుంటే.. ‘లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే, ఢిల్లీలో సత్తా చాటి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకుంటూ, అవసరమైన వాటిని సాధించుకుందాం’ అని చిలుకకు చెప్పినట్టు చెప్పారు. అయినా ప్రజలు వినిపించుకోకుంటే ఎలాంటి పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందో అన్నదానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయమే నిదర్శనం. కేసీఆర్ చెప్పినట్టు 10-12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? అని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం వచ్చిందని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సర్కార్‌కు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి మెజార్టీ సీట్లు రాని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ, బీహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ ఎంపీల మద్దతు అనివార్యం అయింది. ఈ రెండు పార్టీల మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉన్నది. ఈ బలహీనత కారణంగానే ఆంధ్రా, బీహార్ రాష్ర్టాలకు కేంద్రం తన బడ్జెట్లో భారీగా నిధులు, అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల సాయానికి హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుతామన్న హామీతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తదితర లక్షల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులను ప్రకటించింది. బీహార్‌కు రూ. 26 వేల కోట్ల ప్రాజెక్టులతో పాటు వందలాది కోట్ల విలువ చేసే ప్యాకేజీలను ప్రకటించింది.
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దని అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు నిషేధం విధిస్తే, ఇప్పుడు ఇదే టీడీపీ మద్దతుతో కేంద్రంలో కొనసాగుతోన్న ఎన్డీయే ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పదాన్ని నిషేధించడం కాకతాళీయంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనేది రాజకీయ వర్గాలు, తెలంగాణ సమాజంలో చర్చకు దారితీసింది. ఏపీకి మాత్రమే విభజన హామీలను నెరవేరుస్తామని కేంద్రం నిస్సిగ్గుగా ప్రకటించినప్పటికీ తెలంగాణకు చెందిన 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపక పోవడంపై తెలంగాణ భగ్గుమంటుంది.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ముందుగా అంచనా వేసి చెప్పినట్టుగా బీఆర్ఎస్ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిచి ఉంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పంట పండి ఉండేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిపించినా నయా పైసా ఫాయిదా లేకుండా పోయింది. ఇక్కడి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ పెద్దల దృష్టిలో ఇక్కడి ఎంపీలు, కేంద్ర మంత్రుల పరిస్థితి ‘ఘర్ కా ముర్గీ దాల్ కా బరాబర్’ (ఇంటి కోడి పప్పుతో సమానం) అన్నట్టు ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడగలేని స్థితిని తెచ్చి పెట్టుకుంది. రేవంత్‌రెడ్డి సీఎం అయి ఉండీ ప్రధాని మోదీని ‘బడే భాయ్’ అంటూ సాగిలబడడంతో చులకన అయిపోయారన్న విమర్శ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. అప్పటి నుంచే తెలంగాణకు ఏం కావాలో అధికార కాంగ్రెస్ పారీ గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితికి నెట్టివేయబడిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు.