KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోవడంతో మంత్రివర్గంలో అలజడి మొదలైనట్టు తెలిసింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను సభలోనే గట్టిగా నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించి, పార్టీ సభ్యులను సిద్ధంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తున్నది.
దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షం అప్రమత్తమైనట్టు తెలిసింది. కేసీఆర్‌తో సబ్జెక్టు మాట్లాడటం కష్టమని, ఆ స్థాయిని తాము అందుకోలేమనే ఆందోళనతో అధికారపక్షం ఉన్నట్టు తెలిసింది. సాగునీటిపై షార్ట్ డిస్కషన్‌ను అనుమతించి సాధ్యమైనంత వరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరణతోనే నెట్టుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు సాగదీయకుండా రెండు, మూడు రోజుల్లోనే ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా జ్యుడీషియరీ క్యాడర్ నుంచి వచ్చిన అధికారి (ఆర్ తిరుపతి) అసెంబ్లీ కార్యదర్శి హోదాలో శాసనసభను నడిపించబోవడం విశేషం. ఇప్పటి వరకు అసెంబ్లీ క్యాడర్ అధికారులే ఈ బాధ్యత నిర్వర్తించేవారు.