KCR | హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): కేసీఆర్ దెబ్బతో ప్రభుత్వ బండారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పెట్టుబడులన్నీ కట్టు కథలేనని చెప్పిన కేసీఆర్ మాటలు అక్షర సత్యమని సర్కారే అంగీకరిస్తున్నది. పెట్టుబడులపై తప్పుడు లెక్కలను టీజీ ఐపాస్ వెబ్సైట్ నుంచి తొలగించింది. నిన్నటి వరకు టీజీ ఐపాస్ వెబ్సైట్లో పెట్టుబడులపై సంవత్సరాల వారీగా డ్యాష్‌బోర్డును అందుబాటులో ఉంచిన సర్కార్, అందులో ఏ సంవత్సరం, ఎన్ని పెట్టుబడులు, ఎంతమందికి ఉపాధి.. వంటి పూర్తి వివరాలను నమోదు చేసింది. అయితే పెట్టుబడులన్నీ బూటకమంటూ కేసీఆర్ ఆదివారం ప్రెస్మీట్లో కొట్టిపారేయడంతో కంగుతిన్న ప్రభుత్వం, లెక్కలు బయటపడితే పరువుపోతుందనే ముందుచూపుతో వెంటనే జాబితాను వెబ్సైట్ నుంచి పూర్తిగా తొలగించింది. కేసీఆర్ ప్రశ్నించిన తెల్లారే జాబితాను తొలగించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ చెప్పినట్లు పెట్టుబడులపై కాంగ్రెస్ సర్కారు లెక్కలన్నీ బోగసేనని ఈ చర్యతో తేలిపోయింది. ఇందుకు తొలగించిన పెట్టుబడి జాబితా రిపోర్టు (తొలగించక ముందే జాబితాను తీసుకున్నాం) సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇందులో 2024-25లో రాష్ట్రంలో టీజీ ఐపాస్ కింద రూ.5,168.21 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నది. సర్కారు బయట చెప్పే లెక్కలకు, జాబితాలో పేర్కొన్న లెక్కలకు భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో దావోస్ సమ్మిట్‌లో రూ.2.4 లక్షల కోట్లు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 కోట్ల పెట్టుబడులు మొత్తంగా రెండూ కలిపి రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు గొప్పలు చెప్పుకున్నది. కానీ, అధికారికంగా వెబ్సైట్లో మాత్రం కేవలం రూ.5,168 కోట్లు మాత్రమే చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, సర్కారు చెప్పేవన్నీ కట్టుకథలేనని తేటతెల్లమైంది.